World Cup 2023: ఆ నాలుగు జట్లను దించగలరా? ఏకపక్షంగా మారుతున్న సెమీస్ రేసు

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా కొన్ని సంచలనాలు నమోదవ్వడమే కాక.. కొన్ని మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు రావడంతో.. సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారుతున్న సంకేతాలు కనిపించాయి. లీగ్ దశలో చివరి వరకు ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ నెమ్మదిగా పరిస్థితి మారిపోతోంది.

Published : 30 Oct 2023 21:16 IST

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా కొన్ని సంచలనాలు నమోదవ్వడమే కాక.. కొన్ని మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు రావడంతో.. సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారుతున్న సంకేతాలు కనిపించాయి. లీగ్ దశలో చివరి వరకు ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ నెమ్మదిగా పరిస్థితి మారిపోతోంది. టాప్-4 విషయంలో పెద్దగా ఉత్కంఠ ఏమీ నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. త్వరలోనే సెమీస్ బెర్తులపై ఒక స్పష్టత వచ్చేలా ఉంది. లీగ్ దశలో చివర్లో కొన్ని మ్యాచ్‌లు నామమాత్రంగా మారి సెమీస్ ముంగిట ప్రపంచకప్ ఊపు తగ్గేలా ఉంది. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లను మిగతా జట్లు కిందికి దించితే తప్ప సెమీస్ రేసు రసవత్తరంగా మారకపోవచ్చు.

ప్రపంచకప్‌లో ఒక పది రోజులు వెనక్కి వెళ్తే.. సెమీస్ చేరే జట్లేవో చెప్పడం చాలా కష్టంగా కనిపించింది. భారత్, న్యూజిలాండ్ నాలుగేసి విజయాలతో ముందంజలో ఉండగా.. మిగతా రెండు బెర్తుల కోసం తీవ్రమైన పోటీ తప్పేలా లేదనిపించింది. నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ కొన్ని సంచలనాలు నమోదు చేసినా సెమీస్ చేరగలవన్న అంచనా ముందు నుంచి ఎవరికీ లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇబ్బంది పడుతూ కనిపించాయి. కానీ అవి తీసి పడేయదగ్గ జట్లు కాదు కాబట్టి వాటి అవకాశాలను పూర్తిగా కొట్టి పడేయలేని పరిస్థితి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఈ నాలుగు జట్లూ సెమీస్ రేసులో హోరాహోరీగా తలపడేలా కనిపించాయి. ఇంగ్లాండ్.. అఫ్గానిస్థాన్ చేతిలో షాక్ తిన్నప్పటికీ, బలమైన జట్టు కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఏ దశలోనైనా పుంజుకుంటుందనిపించింది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు నెగ్గినప్పటికీ.. నెదర్లాండ్స్ చేతిలో షాక్ తిన్న దక్షిణాఫ్రికాకు.. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలు సాధించిన పాకిస్థాన్, ఆస్ట్రేలియాలకు పెద్దగా తేడా కనిపించలేదు. ఈ జట్లలో వేటికి సెమీస్ బెర్తులు సొంతమవుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. టాప్-2లో ఉన్న భారత్, న్యూజిలాండ్‌ల పరిస్థితి కూడా తిరగబడితే పరిస్థితేంటి అన్న చర్చ జరిగింది. కానీ గత పది రోజుల్లో కథ మారిపోయింది. 

రెండు ఫిక్స్.. రెండు ఔట్

ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్న మాటే కానీ.. ఆరుకు ఆరు విజయాలు సాధించిన భారత జట్టు సెమీస్‌లో అడుగు పెట్టినట్లే. టోర్నీలో ప్రస్తుతం ఆరు విజయాలు సాధించే అవకాశం అయిదు జట్లకే ఉంది. టాప్-4లో ఉన్న మిగతా జట్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కాకుండా శ్రీలంకకు ఆ ఛాన్సుంది. ఐతే 5 మ్యాచ్‌లు ఆడి రెండే నెగ్గిన లంక.. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు విజయాలు నమోదు చేయడం చాలా కష్టం. కాబట్టి భారత్ సెమీస్ చేరడం లాంఛనమే. ఇక 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా సైతం దాదాపుగా ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్ రన్‌రేట్ చాలా బాగుంది. మిగతా మ్యాచ్‌‌ల్లో ఓడినా ముందంజ వేయడానికి ఛాన్సుంది. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి నెగ్గినా దానికి బెర్తు ఖరారవుతుంది. ఇక ఆరేసి మ్యాచ్‌లు ఆడి అయిదు చొప్పున పరాజయాలు చవిచూసిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉన్నట్లు లెక్క. అవి టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి నెదర్లాండ్స్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లపై నెగ్గి అఫ్గానిస్థాన్ రెండేసి సంచలనం రేపాయి కానీ.. మిగతా మ్యాచ్‌ల్లో చిత్తయ్యాయి. ఇక ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ గెలిచి ముందంజ వేయడం అంటే అసాధ్యమే కాబట్టి వాటినీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 

భారత్, దక్షిణాఫ్రికా రెండు బెర్తులను ఖాయం చేసుకున్నాయనుకుంటే.. మిగతా రెండు బెర్తులు ఆస్ట్రేలియా (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), న్యూజిలాండ్ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) జట్లకు దక్కే అవకాశాలే ఎక్కువ. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడాక ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వరుసగా భారీ విజాయలతో సెమీస్‌కు ఫేవరెట్‌గా మారింది. ఆ జట్టున్న ఊపులో సెమీస్ బెర్తును వదిలే అవకాశమే కనిపించడం లేదు. నాలుగు వరుస విజయాల తర్వాత భారత్, ఆస్ట్రేలియాల చేతుల్లో ఓడినప్పటికీ కడదాకా గట్టి పోటీనిచ్చింది కివీస్. కాబట్టి ఆ జట్టు కూడా సెమీస్ చేరే అవకాశాలే ఎక్కువ. ఇక భారత్ చేతిలో ఓడినప్పటి నుంచి కోలుకోలేకపోతున్న పాకిస్థాన్.. వరుసగా నాలుగో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఆ జట్టు కోలుకునేలా కనిపించడం లేదు. శ్రీలంక మూడు వరుస ఓటముల తర్వాత రెండు విజయాలు సాధించింది కానీ ఆ జట్టు పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఈ రెండు జట్లు.. ఆస్ట్రేలియా, న్యూజలాండ్‌లను వెనక్కి నెట్టి సెమీస్ చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. మరి మున్ముందు సంచలన ఫలితాలు వచ్చి సెమీస్ లెక్కలు తారుమారు అవుతాయేమో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని