T20 League 2022: ఒకే ఇన్నింగ్స్‌లో పాంచ్‌ పటాకా.. ఈ బౌలర్లు అదరగొట్టేశారు!

 టీ20 క్రికెట్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది బ్యాటర్ల విధ్వంసం. మైదానం నలువైపులా  ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటారు బ్యాట్స్‌మెన్‌. కానీ, కొన్ని సార్లు సీన్‌ రివర్స్‌ అవుతుంది. బౌలర్లే బ్యాటర్లపై అధిపత్యం చెలాయించి టపాటపా వికెట్లు పడగొడతారు. 

Published : 01 Jun 2022 11:19 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది బ్యాటర్ల విధ్వంసం. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటారు బ్యాట్స్‌మెన్‌. కానీ, కొన్ని సార్లు సీన్‌ రివర్స్‌ అవుతుంది. బౌలర్లే బ్యాటర్లపై అధిపత్యం చెలాయించి టపా టపా వికెట్లు పడగొడతారు. మరి, ఈ సీజన్‌లో బ్యాటర్లపై అధిపత్యం ప్రదర్శించి ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్లు ఎవరో చూద్దామా..

యుజువేంద్ర చాహల్‌

టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ ఈ సీజన్‌లో రాజస్థాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చాహల్‌ 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఏప్రిల్ 18న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో చాహల్‌ హ్యాట్రిక్‌ కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.


వానిందు హసరంగ

శ్రీలంక ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగను మెగా వేలంలో బెంగళూరు రూ.10 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ భారీ ధరకు హసరంగ న్యాయం చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మే 8న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హసరంగ చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ ఓవర్‌ కూడా ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 67 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.


ఉమ్రాన్‌ మాలిక్‌

ఉమ్రాన్‌ మాలిక్‌.. ఈ మధ్య ఎక్కడ చూసిన ఇతడి పేరు మార్మోగుతోంది. అందుకు కారణం అతడు బంతిని విసిరే వేగమే. చాలా మ్యాచ్‌ల్లో 150  కి.మీ.ల వేగంతో బౌలింగ్‌ చేసిన ఉమ్రాన్‌.. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున ఆడి 14 మ్యాచ్‌ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఏప్రిల్ 27న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 


జస్ప్రీత్‌ బుమ్రా

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా టీ20 లీగ్‌లో చాలా ఏళ్లుగా ముంబయికి ఆడుతున్నాడు. బుమ్రా ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 15 వికెట్లే పడగొట్టాడు. మే 9న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెడిన్ ఓవర్‌ కూడా ఉండటం విశేషం. బుమ్రా రాణించిన ఈ మ్యాచ్‌లో ముంబయికి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ముంబయి 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోల్‌కతా 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు