DC vs SRH: వార్నర్ 50 బంతులు ఆడుంటే.. 50 పరుగుల తేడాతో దిల్లీ ఓడిపోయి ఉండేది : హర్భజన్
దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner)పై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్(Harbhajan Singh) విమర్శలు గుప్పించాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా తీసుకోవాలని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ ఐపీఎల్ సీజన్(IPL 2023)లో దిల్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండు విజయాలతో కాస్త ఊపిరి పీల్చుకున్న ఆ జట్టును.. మరో ఓటమి పలకరించింది. దిల్లీని వారి సొంత మైదానంలోనే ఓడించి హైదరాబాద్(SRH).. అంతకుముందు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక దిల్లీ జట్టు ఆట తీరుపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఓటములకు దిల్లీ కెప్టెన్ వార్నరే బాధ్యత వహించాలని పేర్కొన్నాడు.
‘వాళ్లు తిరిగి పుంజుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకు ఆ జట్టు కెప్టెనే కారణం. జట్టును సరైన విధంగా నడిపించడం లేదు. అతడి ఫామ్ కూడా సమస్యగా మారింది. ఇది చాలా నిరాశపరిచింది. వార్నర్ శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఔటయ్యాడు. అందుకే ఈ మ్యాచ్‌లో దిల్లీ చివరి వరకూ వెళ్లింది. ఒకవేళ అతడు 50 బంతులు ఆడుంటే.. అవి వృథా అయ్యేవి. దాంతో దిల్లీ 50 బంతుల తేడాతో ఓటమిపాలయ్యేది’ అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్‌లో విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
వార్నర్ స్ట్రైక్ రేట్ ఏమంత గొప్పగా లేదని భజ్జీ విమర్శించాడు. ఈ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అతడు ఉన్నా.. అతడి స్ట్రైక్ రేటు కేవలం 118.60 అని పేర్కొన్నాడు. ‘మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. సహచర జట్టు ఆటగాళ్ల తప్పుల గురించే చెప్పాడు. అయితే.. నువ్వేం చేశావు..?దూకుడుగా ఆడావా..?. నువ్వు చేసిన 300+ పరుగులు జట్టుకు ఏమైనా ఉపయోగపడ్డాయా?’ అని హర్భజన్ ప్రశ్నించాడు.
ఇక దిల్లీ అవసరమైతే.. వార్నర్‌కు బదులుగా అక్షర్‌పటేల్‌కు కెప్టెన్సీ అప్పగించాలని కూడా హర్భజన్ సూచించాడు. ఇక ప్లేఆప్స్ రేసులో నిలవాలంటే.. దిల్లీ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. భారీ రన్‌రేట్‌తో నెగ్గాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.