Virat Kohli: విరాట్‌ ఎదుట ఒక టోర్నీ.. టార్గెట్లు చాలా!

తన బ్యాటింగ్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చెప్పడానికి విరాట్‌ కోహ్లీకి ఐపీఎల్‌ అద్భుతమైన వేదిక. అతడిపై రేకెత్తిన పలు సందేహాలను ఈ టోర్నీలో పటాపంచలు చేస్తాడని ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. 

Updated : 15 Mar 2024 13:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పొట్టి ఫార్మాట్‌లో ఇప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందేహాలు ముసురుకొన్నాయి. వాస్తవానికి పొట్టి ప్రపంచకప్‌లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. కాకపోతే టీ20ల్లో కొంత గ్యాప్‌ రావడంతో అతడు బ్యాటింగ్‌ లయను అందుకోవడంపైనే సందేహాలు ఉన్నాయి. దీనికి సమాధానం రావాలంటే ఐపీఎల్‌ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కోహ్లీ కెరీర్‌కు సంబంధించి ఈ టోర్నమెంట్‌ ఇప్పుడు కీలకంగా మారింది.

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆర్సీబీ ఆడనుంది. సీనియర్‌ ఆటగాడిగా జట్టును నడిపించడం.. బ్యాటింగ్‌లో రాణించి టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానానికి బలమైన పోటీదారుగా మారడం కోహ్లీ ముందున్న లక్ష్యాలు. 35 ఏళ్ల విరాట్‌ చివరి సారిగా 2022లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన పొట్టి సిరీస్‌ ఆడాడు. అందులో రెండు మ్యాచుల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మరే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడలేదు. ఇదొక్కటే అభిమానులను కొంచెం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తన పదును ఏమాత్రం తగ్గలేదని సెలక్టర్లకు సంకేతాలు పంపేందుకు ఇదే సరైన వేదిక.  

బుమ్రా-హార్దిక్‌ను ముంబయి వదులుకోవాలనుకుంది.. రోహిత్‌ వల్లే ఆ నిర్ణయం వెనక్కి: పార్థివ్‌ పటేల్

అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే. ఇప్పటి వరకు 117 మ్యాచ్‌లు ఆడి 4,037 రన్స్‌ చేశాడు. అతడి సగటు 51.75 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ 138.15. ఈ ఫార్మాట్లో శతకాలు చేసిన ఐదుగురు భారతీయుల్లో విరాట్‌ ఒకడు. 

ఆ మరకను తుడిచేస్తాడా..?

ఐపీఎల్‌ ప్రారంభమైన 17 ఏళ్లలో కేవలం దిల్లీ, పంజాబ్‌, బెంగళూరు జట్లు మాత్రమే ఇప్పటి వరకూ ట్రోఫీని ముద్దాడలేదు. ముఖ్యంగా కోహ్లీ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా.. ఆర్సీబీ విషయంలో అభిమానులకు ఎప్పుడూ నిరాశే మిగులుతోంది. ఈ జట్టు మూడు సార్లు ఫైనల్స్‌లో ఓటములను మూటగట్టుకుంది. ఈ సారి కింగ్‌ తన పరుగుల దాహాన్ని తీర్చుకుని.. జట్టుకు ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు మరో ఆరు పరుగులు సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో 12,000 రన్స్‌ చేసిన ఆరో ఆటగాడిగా ఘనత సాధిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని