IPL 2024: బుమ్రా-హార్దిక్‌ను ముంబయి వదులుకోవాలనుకుంది.. రోహిత్‌ వల్లే ఆ నిర్ణయం వెనక్కి: పార్థివ్‌ పటేల్

రోహిత్ శర్మ (Rohit Sharma) సారథిగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుంటాడు. ఇదే విషయం ఒకప్పటి ముంబయి ఇండియన్స్‌ సహచరుడు వెల్లడించాడు.

Published : 15 Mar 2024 10:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో (IPL) ముంబయి ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు రోహిత్ శర్మ (Rohit Sharma). ఈ సీజన్‌లో  అతడికి బదులు హార్దిక్‌ పాండ్యకు (Hardik Pandya) యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడంతా ఇదే హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. తాజాగా రోహిత్ గొప్ప కెప్టెన్సీ గురించి భారత మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంలో హిట్‌మ్యాన్‌ ముందుంటాడని.. గతంలో బుమ్రా-పాండ్య విషయంలోనూ ఇది నిరూపితమైందని పటేల్ వెల్లడించాడు. పార్థివ్‌ పటేల్‌కు కూడా ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన అనుభవం ఉంది.

‘‘ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే కెప్టెన్ రోహిత్. దీనికి చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. బుమ్రా 2014లో ముంబయి జట్టులోకి వచ్చాడు. ఆ ఎడిషన్‌లో ఆడలేదు. 2015 సీజన్‌లో ఆడే అవకాశం వచ్చింది. గొప్ప ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడిని వదులుకోవాలని ముంబయి ఫ్రాంచైజీ భావించింది. కానీ, రోహిత్ మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. తప్పకుండా భవిష్యత్తులో అత్యుత్తమ బౌలర్‌గా మారతాడని ముంబయిని ఒప్పించాడు. జట్టులో కొనసాగేలా చేశాడు. ఆ తర్వాత 2016 సీజన్‌లో బుమ్రా చెలరేగిపోయాడు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.

ఇదే విధానం హార్దిక్‌ పాండ్య విషయంలోనూ జరిగింది. పాండ్య 2015 సీజన్‌లో ముంబయికి వచ్చాడు. అప్పుడు ఫర్వాలేదనిపించినా.. 2016లో అతడి ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఇలాంటి సమయంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ అయినా వదులుకోవాలనే చూస్తుంది. ఆ తర్వాత రంజీల్లో ఎలా ఆడాడనే దానిని అంచనా వేసి మళ్లీ తీసుకుంటుంది. కానీ, రోహిత్ సారథ్యంలో అలాంటి పరిస్థితి రానివ్వలేదు. తన ఆటగాళ్లపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చేవాడు. 2017 సీజన్‌లో రోహిత్ తన బ్యాటింగ్‌ స్థానాన్ని వదులుకొని మరీ జోస్‌ బట్లర్‌కు అవకాశం ఇచ్చాడు. దీంతో నేను బట్లర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశా’’ అని పార్థివ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని