Chennai Vs Bengaluru: అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్‌ బెర్తు వారిదేనంటున్న లారా

నాలుగు మ్యాచ్‌లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది.

Updated : 17 May 2024 12:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకుంది. కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవాళ ముంబయి - లఖ్‌నవూ మధ్య వాంఖడేలో మ్యాచ్‌ జరగనుంది. ఈ పోరుకు పెద్ద విశేషం ఏమీ లేదు. ఎవరు గెలిచినా ‘ప్లేఆఫ్స్‌’పై ప్రభావం ఉండదు. దీంతో అందరి కళ్లూ శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌పైనే ఉంది. ఇప్పటికే మూడు టీమ్‌లు ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న వేళ.. నాలుగో బెర్తును దక్కించుకునేది ఎవరో ఆ రోజు తేలిపోనుంది. ఈ క్రమంలో విండీస్‌ మాజీ ఆటగాడు బ్రియాన్‌ లారా ఏ జట్టు ప్లేఆఫ్స్‌నకు వెళ్తుందో అంచనా వేశాడు.

‘‘గత ఐదు మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించింది. చెన్నైతోనూ ఆ జట్టు అదే స్థాయిలో ఆడనుంది. నా అంచనా ప్రకారం ఆర్సీబీనే గెలుస్తుందని భావిస్తున్నా. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కీలకమైన రెండో దశలో ఇతర ఆటగాళ్లూ రాణిస్తుండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్సీబీ సాధించలేదు. ఆ జట్టు చాలా ఆకలితో ఉంది. ఇప్పుడీ మ్యాచ్‌ ప్లేఆఫ్స్‌నకు దారి చూపిస్తుంది. దీనిని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండదు. డుప్లెసిస్‌, సిరాజ్ కూడా ఫామ్‌లోకి వచ్చారు. సీఎస్కేను కూడా తక్కువగా అంచనా వేయొద్దు. అక్కడ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. కాబట్టి, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మ్యాచ్‌ చాలా రసవత్తరంగా ఉంటుంది’’ అని లారా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ మ్యాచ్‌ జరగకుండా మ్యాచ్‌ రద్దైతే మాత్రం సీఎస్కే ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. అప్పుడు చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఆర్సీబీ 13 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. 

ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనీ

చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌ కావడంతో ఇప్పటికే చెన్నై ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. శనివారం మ్యాచ్‌ కావడంతో ప్రాక్టీస్‌ షురూ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి అతిథిలా ధోనీ (MS Dhoni) వచ్చాడు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ధోనీని ఆప్యాయంగా ఆహ్వానించిన ఆ జట్టు అతడికి టీని ఆఫర్‌ చేసింది. ఈ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌ వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని