Kolkata Vs Hyderabad: తొలి క్వాలిఫయర్‌.. అభిషేక్‌కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్

నాకౌట్‌ దశలో తొలి మ్యాచ్‌ కోల్‌కతాతో తలపడేందుకు హైదరాబాద్‌ సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Published : 21 May 2024 15:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌ తొలి క్వాలిఫయర్‌కు అహ్మదాబాద్‌ వేదిక. కోల్‌కతా X హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల దూకుడుకు.. కేకేఆర్‌ బౌలింగ్‌కు అసలైన పోరు ఉంటుందని క్రికెట్ పండితుల అంచనా. ఈ క్రమంలో యువ బ్యాటర్ అభిషేక్ శర్మకు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక సూచనలు చేశాడు. కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తి జోడీ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించాడు. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ శర్మ 13 ఇన్నింగ్స్‌ల్లో 467 పరుగులు చేశాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో శర్మ ‘ప్లాన్‌ A’ గేమ్‌తో ఆడితేనే ఆ ఇద్దరిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని చోప్రా వ్యాఖ్యానించాడు. వచ్చే జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు అభిషేక్‌ను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సెలక్టర్లకు సూచించాడు. 

‘‘భారత జట్టు తరఫునా అభిషేక్‌ శర్మ ఆడేందుకు సమయం వస్తుందని అనుకుంటున్నా. శ్రీలంక, జింబాబ్వే దేశాలకు అతడిని ఎంపిక చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఓపెనింగ్‌ చేస్తాడు. ఇప్పుడు ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌లో నరైన్, వరుణ్‌పై అభిషేక్ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి. ట్రావిస్‌ హెడ్‌ కూడా శర్మతో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు కాబట్టి.. స్పిన్‌ను త్వరగానే బౌలింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్పిన్‌ను సమర్థంగా అడ్డుకొని పరుగులు చేయాలంటే భారత బ్యాటర్‌గా అభిషేక్‌ ఒక అడుగు ముందుకేయాలి. వారిని అడ్డుకోగలిగితే మ్యాచ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ పట్టు సాధించడం ఖాయం’’ అని చోప్రా తెలిపాడు. 

హెడ్‌ - అహ్మదాబాద్‌ పిచ్‌ మధ్య లవ్‌ఎఫైర్!

‘‘ట్రావిస్‌ హెడ్‌కు అహ్మదాబాద్‌ పిచ్‌ అంటే చాలా ఇష్టం. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇక్కడే శతకం సాధించాడు. భారత్‌ను ఓడించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. కాబట్టి, హెడ్‌ ఈసారి హైదరాబాద్‌ జట్టును గెలిపిస్తాడని అనుకుంటున్నా. ఎస్‌ఆర్‌హెచ్‌కు వన్‌డౌన్‌ కాస్త బలహీనంగా అనిపిస్తోంది. రాహుల్‌ త్రిపాఠి గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తే తిరుగుండదు’’ అని భారత మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని