T20 world Cup: ‘డి’ అంటే ఢీ

పొట్టి క్రికెట్లో మహా పోరుకు రంగం సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్‌ ఇంకో నాలుగు రోజుల్లోనే ఆరంభం కాబోతోంది. ఈసారి పెద్ద జట్లకు తోడు మధ్య స్థాయివి, కూనలు కలిపి మొత్తం 20 జట్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

Updated : 29 May 2024 15:32 IST

టీ20 ప్రపంచకప్‌  మరో 4రోజుల్లో 

పొట్టి క్రికెట్లో మహా పోరుకు రంగం సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్‌ ఇంకో నాలుగు రోజుల్లోనే ఆరంభం కాబోతోంది. ఈసారి పెద్ద జట్లకు తోడు మధ్య స్థాయివి, కూనలు కలిపి మొత్తం 20 జట్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి ఆయా జట్ల బలాబలాలేంటో.. గ్రూపుల్లో వీటి మధ్య పోటీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా గ్రూప్‌-డి కథేంటో చూద్దాం.

ఈనాడు క్రీడావిభాగం

టీ20 ప్రపంచకప్‌లో ‘డి’ భిన్నమైన గ్రూప్‌. దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి పేరున్న జట్లున్నా.. నెదర్లాండ్స్, నేపాల్‌లను తక్కువ అంచనా వేయలేం. టీ20ల్లో జట్ల మధ్య ఎప్పుడేమైనా జరగొచ్చు కాబట్టి సంచలనాలు నమోదయ్యే అవకాశాలు  లేకపోలేదు. ఏ మ్యాచ్‌నూ ఏ జట్టూ తేలిగ్గా తీసుకునే వీల్లేదు.

అదృష్టం కలిసొస్తే..

ప్రపంచకప్‌ అనగానే దక్షిణాఫ్రికా దురదృష్టమే గుర్తొస్తుంది. ఎంతటి నైపుణ్యం ఉన్నా అదృష్టం లేక ముందుకెళ్లని సందర్భాలు చరిత్రలో ఎన్నో. పొట్టికప్పులో 2009లో సెమీస్‌ చేరడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉన్న సఫారీ జట్టు మరోసారి అదృష్టం పరీక్షించుకోనుంది. మార్‌క్రమ్‌ సారథ్యంలోని ఆ జట్టుపై గ్రూప్‌-డిలో బలమైన జట్టు. అయితే దక్షిణాఫ్రికా గ్రూప్‌ దశ దాటినా సెమీస్‌ చేరడం అంత తేలిక కాదు. ఆ జట్టులో స్టార్లకు కొదువలేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసే మిల్లర్, క్లాసెన్‌ .. బంతితో అదరగొట్టగల రబాడ, నోకియా పెద్ద బలం. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్, మిడిలార్డర్‌ బ్యాటర్‌ స్టబ్స్‌ ఊపుమీదున్నారు.  అనుభవజ్ఞులు  మార్‌క్రమ్, డికాక్‌ ఫామ్‌లో లేరు. యువ పేసర్లు జాన్సన్, బార్ట్‌మ్యాన్, కొయెట్జీ ఎలా రాణిస్తారో చూడాలి. 

ఉత్తమ ప్రదర్శన: 2009 సెమీస్‌


అంచనాలు లేకుండా..

కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఇంకా పునర్నిర్మాణంలోనే ఉన్న శ్రీలంక.. ప్రపంచకప్‌ రూపంలో మరో సవాల్‌కు సిద్ధమైంది. కెప్టెన్, ఆల్‌రౌండర్‌ హసరంగ ఆ జట్టుకు వెన్నెముక. ఫామ్‌లో ఉన్న నిశాంకతో పాటు కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, అసలంక రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా వన్డేలు, టీ20ల్లో స్థిరంగా రాణిస్తున్న నిశాంక, కుశాల్‌లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఆరో టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న 37 ఏళ్ల ఏంజెలో మాథ్యూస్, మరో ఆల్‌రౌండర్‌ శానక కూడా కీలక ఆటగాళ్లే. మలింగ మాదిరి బౌలింగ్‌ చేసే పతిరన, తుషార లంక బౌలింగ్‌ను బలోపేతం చేస్తున్నారు. స్పిన్నర్‌ తీక్షణ ఫామ్‌లో లేడు. యువ స్పిన్నర్‌ వెల్లలాగెపై మంచి అంచనాలున్నాయి. శ్రీలంకకు గ్రూప్‌ దశ దాటే సామర్థ్యం ఉంది కానీ బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఉత్తమ ప్రదర్శన: 2014లో విజేత


బంగ్లాతో ప్రమాదమే..

బంగ్లాదేశ్‌.. టీ20 ప్రపంచకప్‌లో ఈ జట్టు ఆట మరీ గొప్పగా ఏం లేదు. కానీ బంగ్లాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవల అమెరికాతో సిరీస్‌ కోల్పోయిన నజ్ముల్‌ శాంటో బృందం అండర్‌ డాగ్‌గా బరిలో దిగుతోంది. తనదైన రోజున బలమైన జట్లను మట్టికరిపించే సత్తా బంగ్లాకు ఉంది. ఐపీఎల్‌లో చెన్నై తరఫున రాణించిన ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌హసన్‌ జట్టుకు పెద్ద బలం. మెహిదీ హసన్, రిషాద్‌ హసన్‌ లాంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. యువ ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. తనతో పాటు సౌమ్య సర్కార్, మహ్మదుల్లా, లిటన్‌దాస్‌ బ్యాటింగ్‌లో కీలకం. బంగ్లా స్థాయికి తగ్గట్లు ఆడితే గ్రూప్‌ దాటొచ్చు.

ఉత్తమ ప్రదర్శన: 2007లో సూపర్‌-8


పసికూనలే అయినా..

‘డి’ గ్రూప్‌లో ఉన్న మరో రెండు జట్లు నెదర్లాండ్స్, నేపాల్‌. పేరుకే ఇవి పసికూనలు.. కానీ పెద్ద జట్లను గట్టి దెబ్బ కొట్టే సత్తా ఉన్నవి. ముఖ్యంగా స్వాట్‌ ఎడ్వర్డ్స్‌ కెప్టెన్సీలోని నెదర్లాండ్స్‌.. ఇటీవల మెరుగైన ప్రదర్శన చేస్తోంది. గతంలో టీ20 ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఈ జట్టుకుంది. తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు ఈ జట్టులో సభ్యుడు. బాస్‌ డిలీడ్, వాన్‌బీక్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు నెదర్లాండ్స్‌ సొంతం. మీకెరెన్, ఆర్యన్‌ దత్‌లతో బౌలింగ్‌ కూడా పర్వాలేదు. గతంలో కంటే ఈసారి మెరుగ్గా రాణించాలని, పెద్ద జట్లపై సంచలనాలు నమోదు చేయాలని నెదర్లాండ్స్‌ సంకల్పంతో ఉంది. మరోవైపు టీ20ల్లో రికార్డులు బద్దలుకొడుతూ అందరి దృష్టిలో పడిన నేపాల్‌తో కూడా పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. రోహిత్‌ పౌడెల్‌ సారథ్యంలోని ఆ జట్టులో ఆలల్‌రౌండర్లు దీపేంద్ర సింగ్, కుశాల్‌ బుర్టెల్, కుశాల్‌ మల్లా కీలక ఆటగాళ్లు. 

ఉత్తమ ప్రదర్శన: నెదర్లాండ్స్‌ (సూపర్‌-12, 2022) నేపాల్‌ (తొలి రౌండ్, 2014)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని