Afghan: అఫ్గాన్ విజయాల వెనుక మన జడేజా.. పాక్‌ పాలిట సింహస్వప్నం

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలకు లోటు లేదు. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లకు షాకులు తప్పడం లేదు. తాజాగా పాక్‌పై అఫ్గాన్‌ (PAK vs AFG) విజయం కూడా ఇదే జాబితాలోకి చేరింది.

Updated : 24 Oct 2023 13:40 IST

వన్డే ప్రపంచకప్‌ 2023లో (ODI World Cup 2023) ఇప్పటి వరకు మూడు సంచలనాలు నమోదయ్యాయి. అందులో రెండు అఫ్గానిస్థాన్‌వే. ‘పసికూన’ అని లైట్ తీసుకున్నవాళ్లకు గట్టి షాక్‌లే ఇచ్చింది. వరల్డ్‌ కప్‌లో ఇలా చిచ్చరపిడుగులా మారడం వెనుక ఓ భారత మాజీ స్టార్‌ ప్లేయర్‌ ఉన్నాడని తెలుసా? అతనే అజయ్ జడేజా. ప్రస్తుతం అఫ్గాన్‌కి మెంటార్‌. అంతేకాదు పాక్‌పై విజయం వెనుక ‘పాక్‌ X జడేజా’ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. 

మన దేశం మొత్తం దసరా పండగ సందడిలో బిజీగా ఉంది. క్రికెట్‌ అభిమానుల్లో ఆ సంతోషాన్ని దాదాపు రెట్టింపు చేసింది ఓ క్రికెట్‌ మ్యాచ్ ఫలితం. పాకిస్థాన్‌కు షాక్‌ ఇస్తూ అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్‌ గెలిస్తే మనకేం సంబరం అనుకుంటున్నారా? ఆ జట్టు విజయం వెనుక ఉన్న కీలక వ్యక్తి మన దేశస్థుడు అజయ్‌ జడేజా. అంతేకాదు మన దేశం ప్రోత్సాహంతోనే ఇప్పుడు దూసుకుపోతూ మేటి జట్లకు అఫ్గాన్ షాక్‌లిస్తోంది. 

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌కు భారత్‌ ఎంతో కాలంగా బాసటగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాలను కల్పించడం నుంచి ఆ దేశంలో స్టేడియం నిర్మాణం వరకూ సహకారం అందించింది. ఇప్పుడు ఏకంగా ఆ జట్టు మన మాజీ స్టార్‌ ప్లేయర్‌ అజయ్‌ జడేజాను మెంటార్‌గా నియమించుకుంది. టోర్నీ ఆరంభానికి కేవలం వారం వ్యవధిలోనే జట్టుతోపాటు చేరిన అజయ్‌ జడేజా ఆటగాళ్లతో భలేగా కలిసిపోయాడు. ఐపీఎల్లో అడిన అనుభవం, ఇక్కడి మైదానాల గురించి తెలిసిన వ్యక్తి మెంటార్‌ కావడంతో షాహిదీ జట్టు దూసుకెళ్తోంది. రషీద్‌, ముజీబ్‌, నూర్, నబీ... ఇలా ఎవరికివారు తమదైన రోజున ప్రత్యర్థిని వణికిస్తున్నారు. ఈసారి బ్యాటింగ్ విభాగంపై అజయ్‌ జడేజా దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అందుకే అఫ్గాన్‌కు ఈ భారీ విజయాలు, షాక్‌లు ఇతర జట్లకు ఎదురవుతున్నాయట. 

అప్పుడు అజయ్‌ జడేజా.. 

పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ విజయంతో.. 1996 వరల్డ్‌ కప్‌ రెండో క్వార్టర్ ఫైనల్‌ను గుర్తు చేసుకుంటున్నారు ఇండియన్‌ ఫ్యాన్స్‌. ఆ మ్యాచ్‌లో పాక్‌పై చివర్లో అజయ్‌ జడేజా కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్‌ క్రికెటర్లకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. వకార్‌ యూనిస్‌, అకీబ్‌ జావెద్‌ వంటి బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించడమే ఆ మ్యాచ్‌ ప్రత్యేకత. ఇక జడేజా టీమ్‌ ఇండియా ప్లేయర్‌గా కొనసాగుతున్న రోజుల్లో డేరింగ్‌ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్‌ వచ్చే చోట రెండో పరుగు తీయడం లాంటివి చేసేవాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌ బ్యాటర్లు చేసింది కూడా ఇదే. ఇక ఫీల్డింగ్‌లో జడేజా మెరుపులు చాలానే ఉన్నాయి. గాల్లోకి అమాంతం ఎగరడం, ఒంటి చేతి క్యాచ్‌లు, సింగిల్‌ స్టంప్‌ వ్యూ రనౌట్‌లు లాంటివి ఎన్నో అజయ్‌ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటివే అఫ్గాన్‌ ప్లేయర్ల దగ్గర చూస్తున్నాం కూడా. 

పాక్‌ అంటే పూనకమే...

గతంలో పాక్‌పై అజయ్‌ జడేజా మంచి గణాంకాలే నమోదు చేశాడు. కెరీర్‌ మొత్తంలో వన్డేల్లో 196 మ్యాచ్‌లు ఆడిన జడేజా... 5359 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్ల లెక్కలు చూస్తే.. పాకిస్థాన్‌ మీదే ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌కు అత్యధిక పరుగులు సాధించాడు. మొత్తంగా పాక్‌పై 40 మ్యాచ్‌లు ఆడిన అజయ్‌ 892 పరుగులు చేశాడు. బౌలర్‌గా రెండు వికెట్లు తీశాడు. కచ్చితంగా ఈ అనుభవాన్ని అఫ్గాన్‌ కుర్రాళ్లకు నేర్పే ఉంటాడు. ఇక ఒత్తిడిలో చిత్తవడం అనేది జడేజాకు తెలియదు అంటుంటారు. వకార్‌ యూనిస్‌ లాంటి ఫాస్ట్‌ బౌలర్‌ వేసిన బంతినే అలవోకగా స్టాండ్స్‌లోకి పంపిన ఘనుడు. ఇప్పుడు అదే అఫ్గాన్‌ ప్లేయర్లకు నూరిపోస్తున్నాడేమో అనిపిస్తోంది వారి ప్రదర్శన చూస్తుంటే. 

తడబాటుతో ప్రారంభం...

అజయ్‌ జడేజా మార్గదర్శకంలో వరల్డ్‌ కప్‌లోకి అడుగు పెట్టిన అఫ్గాన్‌కు తొలి మ్యాచ్‌లో షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌పై 156 పరుగులకే ఆలౌటైంది. అలాగని బౌలింగ్‌లో తీసికట్టు ప్రదర్శన చేయకుండా పోరాడింది. కానీ, ఓటమి తప్పలేదు. ఇక భారత్‌పై అఫ్గాన్‌ బ్యాటింగ్ విభాగం చెలరేగుతుందని ఎవరూ ఊహించలేదు. మిడిలార్డర్‌లో కెప్టెన్ షాహిది, అజ్మతుల్లా నిలకడైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో 50 ఓవర్లలో 272 పరుగులు చేయగలిగింది. కానీ, భారత బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉండటంతో అఫ్గాన్‌ బౌలర్లు చేతులెత్తేశారు. రెండు ఓటముల తర్వాత ఎలాంటి జట్టైనా ఇబ్బంది పడటం సహజం. కానీ, మూడో మ్యాచ్‌ నాటికి పుంజుకున్న తీరు అమోఘం. ఇంగ్లాండ్‌పైనా 284 పరుగులు చేసి ఔరా అనిపించింది. బౌలింగ్‌లోనూ రాణించి వారిని 215 పరుగులకే ఆలౌట్ చేసి తొలి సంచలన విజయాన్ని రుచిచూసింది. ఇప్పుడు రెండో విజయంగా పాక్‌ను మట్టికరిపించి గెలుపును సొంతం చేసుకుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని