Ajay Kumar Saroj: అప్పులు తీర్చడానికి అథ్లెటిక్స్‌ బాట పట్టి

ఇంట్లో సోదరుడు, సోదరిలు జాతీయ స్థాయి అథ్లెట్లే కావడంతో సరోజ్‌కు అతడికి త్వరగా అథ్లెటిక్స్‌లో పట్టు దొరికింది. అయితే వాళ్లందరూ ఆర్థిక స్థోమత కారణంగానే పరుగు ఆపేశారు. తన పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో అన్న భయం సరోజ్‌లో కూడా ఉండేది.

Published : 24 Oct 2023 13:52 IST

అతడి తండ్రి ఓ ప్లంబర్‌.. పెద్ద కుటుంబం! ఊరి నిండా అప్పులే! ఇలాంటి స్థితిలోంచి కూడా ఓ ఛాంపియన్‌ పుట్టడం ఆశ్చర్యమే! కానీ అజయ్‌ కుమార్‌ సరోజ్‌ కష్టాలను దాటి ట్రాక్‌ ఎక్కాడు. అప్పులు తీర్చడం కోసం పతకాల బాట పట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ అథ్లెట్‌ ఇటీవల హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 1500 మీటర్ల పరుగులో రజతంతో మెరిసి సత్తా చాటాడు. 

అజయ్‌కుమార్‌ చిన్నప్పుడు నాన్నతో పాటే ప్లంబర్‌ పనికి సాయంగా వెళ్లేవాడు. నాన్న లేకపోతే ఆ పనులన్నీ తానే చేసేవాడు. ఒకరోజు ఒక మైదానానికి వెళ్లినప్పుడు అక్కడ పరుగులు తీస్తున్న అథ్లెట్లను చూసి తాను ఆ ఆట ఆడితే బాగుంటుందని అనుకున్నాడు. ఇంట్లో సోదరుడు 800 మీటర్లు, 1500 మీటర్లు, సోదరిలు జాతీయ స్థాయి అథ్లెట్లే కావడంతో సరోజ్‌కు అతడికి త్వరగా అథ్లెటిక్స్‌లో పట్టు దొరికింది. అయితే వాళ్లందరూ ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగానే పరుగు ఆపేశారు. తన పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో అన్న భయం సరోజ్‌లో ఉండేది. ఒకవైపు నాన్నతో పనికి వెళుతూనే మరోవైపు అలహాబాద్‌లోని మదన్‌ మోహన్‌ మాలవియా స్టేడియంలో సాధన చేసేవాడు. 

2012 జాతీయ జూనియర్‌ క్రీడల్లో 1000 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడం సరోజ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే సమయంలో కోచ్‌ జస్వీందర్‌ భాటియా.. సరోజ్‌లోని ప్రత్యేకతను గుర్తించి అతడిని లఖ్‌నవూకు రప్పించి శిక్షణ ఇప్పించాడు. డబ్బులు ఎంత ఖర్చయినా తనయుడు ఎలాగైనా అంతర్జాతీయ అథ్లెట్‌ కావాలని భావించిన అతడి తండ్రి.. అప్పులు చేసి పోటీలకు పంపేవాడు. సుదూర పరుగులు తీసినా అలసిపోని సామర్థ్యం ఉండడంతో ఈ విభాగాలపైనే దృష్టి పెట్టాడు.  2014 యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2016 ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌లో పసిడితో సత్తా చాటాడు సరోజ్‌. అదే ఏడాది ఇండియన్‌ గ్రాండ్‌ప్రిలో 3 నిమిషాల 44 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత 1500 మీటర్ల పరుగులోనూ సత్తా చాటాడు. ఈ ఈవెంట్లో 2018 జకర్తా ఆసియా క్రీడలకు ముందు జరిగిన టోర్నీలోనూ 3 నిమిషాల 43.85 సెకన్లలో రేసు పూర్తి చేసి సత్తా చాటిన సరోజ్‌.. కాలి గాయంతో ఈ క్రీడలకు దూరమయ్యాడు. కానీ సరోజ్‌ పట్టు వదల్లేదు. పునరాగమనంలో సత్తా చాటాడు. హాంగ్‌జౌ ఆసియా క్రీడలకు ముందు అమెరికాలోని కొలరాడో పర్వతాల్లో తీసుకున్న కఠోర శిక్షణ అతడికి బాగా ఉపయోగపడింది. హాంగ్‌జౌలో 1500 మీటర్ల పరుగును 3 నిమిషాల 38.94 సెకన్లలో పరుగెత్తి రెండో స్థానంలో నిలిచాడు సరోజ్‌.

సరోజ్‌ రజతం గెలవడంతో అతడి సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.1.5 కోట్ల నజరానాగా ప్రకటించడంతో ఆ డబ్బుతో అప్పులు తీర్చాలని ఈ కుర్రాడు భావిస్తున్నాడు. అంతేకాదు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించి పతకం తేవాలని పట్టుదలతో ఉన్నాడు సరోజ్‌.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని