T20 WORLD CUP 2024: విండీస్‌ దెబ్బకు ఉగాండా చిత్తు.. 39 పరుగులకే ఆలౌట్

ఆతిథ్య వెస్టిండీస్‌ వరుస విజయాలు సాధిస్తూ సూపర్ - 8 దిశగా సాగుతోంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది.

Updated : 09 Jun 2024 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై వెస్టిండీస్‌ జోరు కొనసాగుతోంది. పసికూన ఉగాండాపై 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్ 173/5 స్కోరు చేసింది. ఛార్లెస్ (44), రస్సెల్ (30), పూరన్ (22), రోవ్‌మన్ పావెల్ (23), రూథర్‌ఫెర్డ్‌ (22) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఉగాండా 39 పరుగులకే కుప్పకూలింది. కేవలం ఒక్క బ్యాటర్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయడం గమనార్హం. జుమా మియాగి (13*) టాప్‌ స్కోరర్. విండీస్‌ బౌలర్ అకీల్ హుసేన్ (5/11) రికార్డు ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన రెండో జట్టుగా ఉగాండా నిలిచింది. గతంలో (2014) శ్రీలంకపై నెదర్లాండ్స్‌ కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. ఇక అత్యధిక తేడాతో ఘన విజయం సాధించిన రెండో మ్యాచ్‌ ఇదే. గతంలో కెన్యాపై శ్రీలంక 172 పరుగుల తేడాతో గెలిచింది. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చుక్కెదురు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (39), ట్రావిస్ హెడ్ (34), స్టాయినిస్ (30), మ్యాక్స్‌వెల్ (28) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 165/6 స్కోరుకే పరిమితమైంది. జోస్ బట్లర్ (42), ఫిలిప్ సాల్ట్ (37), మొయిన్ అలీ (25), హ్యారీ బ్రూక్ (20), లియామ్‌ లివింగ్‌ స్టోన్ (15) రాణించినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాట్ కమిన్స్ 2, ఆడమ్ జంపా 2.. హేజిల్‌వుడ్, స్టాయినిస్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో ఇంగ్లండ్‌ రెండు మ్యాచుల్లో ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ రద్దుతో సూపర్ -8 అవకాశాలు సంక్లిష్టంగా మార్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు