Alastair Cook: కెరీర్‌కు ముగింపు పలికిన కుక్... ఇండియా అతడికి ప్రియమైన శత్రువు!

ఇంగ్లాండ్‌ దిగ్గజ ఆటగాడు ఆలిస్టర్‌ కుక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్న తెలిపాడు. కుక్‌ ఘనతలు, మన దేశంతో ఉన్న అనుబంధం ఏంటో చూద్దామా!

Published : 16 Oct 2023 19:47 IST

వన్డేలు, టీ 20లు, టీ 10లు.. ఇలా క్రికెట్ ఫార్మాట్లు అంతకంతకూ కుచించుకుపోతున్నాయి. ఈ తరం క్రికెట్ అభిమానులంతా ఇన్‌స్టంట్ వినోదాన్నే కోరుకుంటున్నారు. వాటినే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. కానీ ఒక క్రికెటర్ నైపుణ్యానికి అసలైన పరీక్ష పెట్టేది మాత్రం సుదీర్ఘ ఫార్మాటే. ఒక క్రికెటర్‌కు పరిపూర్ణత వచ్చేది టెస్టుల్లో సత్తా చాటుకున్నపుడే. ఈ ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్ల జాబితా తీస్తే అందులో అలిస్టర్ కుక్‌కు స్థానం దక్కుతుంది. టెస్టుల్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు ఐదేళ్ల ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా.. ఇప్పుడు మొత్తంగా క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి గణాంకాలు, ఘనతలు చూస్తే తన స్థాయి ఏంటో అర్థమవుతుంది.
 
అంతర్జాతీయ క్రికెట్లో ఐదు రోజుల పాటు సాగే టెస్టులతో పాటు 4-5 రోజుల వ్యవధిలో సాగే దేశవాళీ మ్యాచ్‌లను కూడా కలిపి ఫస్ట్ క్లాక్ క్రికెట్ అంటారు. ఈ ఫార్మాట్లో ఒకసారి అలిస్టర్ కుక్ కెరీర్ ఎలా ఉందో చూద్దాం. 352 మ్యాచ్‌లు, 26,643 పరుగులు, 74 సెంచరీలు, 125 అర్ధసెంచరీలు, 46.41 సగటు.. ఇవీ కుక్ ఫస్ట్ క్లాస్ కెరీర్ గణాంకాలు. వీటిని బట్టే తనెంత గొప్ప ఆటగాడో అర్థమవుతుంది. 20 ఏళ్లకు పైగా సాగిన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు కుక్ ఇప్పుడు ముగింపు పలికాడు. 2018లోనే కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ ఫార్మాట్లో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కుక్ గుర్తింపు సంపాదించాడు. అతను ఏకంగా 161 టెస్టులు ఆడాడు. అందులో 45.35 సగటుతో 12,472 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి శతకాలు 33. 

ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు, పరుగుల రికార్డు అతడిదే. మొత్తంగా క్రికెట్ చరిత్రలో సచిన్ (200 టెస్టుల్లో 15,921 పరుగులు), పాంటింగ్ (168 - 13,378), కలిస్ (166 - 13,289), ద్రవిడ్‌ (164 - 13,288)ల తర్వాత అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడింది, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించింది అలిస్టరే. కుక్ 59 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే సమయానికి అతనే టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ఉత్తమ కెప్టెన్. తాను నాయకత్వం వహించిన 59 టెస్టుల్లో జట్టుకు 24 విజయాలు అందించాడు. తర్వాత జో రూట్ (64 టెస్టుల్లో 27 విజయాలు) అతణ్ని అధిగమించాడు.

అతను భిన్నం

ప్రపంచ క్రికెట్లో చాలా దేశాల ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం అరుదు. భారత ఆటగాళ్లయితే రంజీలు, ఇతర దేశవాళీ టోర్నీల ముఖమే చూడరు. ఫామ్ కోల్పోయి వేటు పడితే తప్ప దేశవాళీల్లో ఆడరు మనవాళ్లు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక అయితే అసలే దేశవాళీ క్రికెట్ ఆడరు. ఐపీఎల‌్‌లో మాత్రమే కొనసాగుతారు. కానీ అలిస్టర్ కుక్ మాత్రం ఇందుకు భిన్నం. ఇంగ్లాండ్‌లో ఇప్పటికీ కౌంటీ క్రికెట్, వాటిని నడిపించే క్లబ్బులు బలంగా ఉన్నాయి. కౌంటీలు ఆడటాన్ని అక్కడి ఆటగాళ్లు ప్రతిష్ఠాత్మకంగా చూస్తారు. 

అంతర్జాతీయ క్రికెట్లో కుక్‌ కెరీర్ ఆరంభం నుంచి టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. టెస్టులు లేనపుడు కౌంటీలు ఆడేవాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా అతను కౌంటీ క్రికెట్లో కొనసాగాడు. తనకు లైఫ్ ఇచ్చిన ఎసెక్స్ క్లబ్బుకే ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో ఐదేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగాడు. తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఏకంగా 26 వేలకు పైగా పరుగులు, 74 శతకాలు సాధించాడు. 20 ఏళ్ల తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఎట్టకేలకు మొత్తంగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

భారత్‌తో బంధం ప్రత్యేకం

అలిస్టర్ కుక్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది భారత్‌తోనే కావడం విశేషం. 2005-06 పర్యటనలో నాగ్‌పుర్‌లో జరిగిన మ్యాచ్‌తో అతడి అరంగేట్రం జరిగింది. డ్రాగా ముగిసిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లోనే 60 పరుగులతో ఆకట్టుకున్న కుక్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ బాదేశాడు. అలిస్టర్ తన చివరి టెస్టును సైతం భారత్‌తోనే ఆడటం.. అందులోనూ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం (71), రెండో ఇన్నింగ్స్‌లో శతకం (147) సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. 

ఇక ఇంగ్లాండ్‌కు 2012-13 భారత పర్యటనలో చారిత్రక విజయాన్నందించిన కెప్టెన్ అలిస్టరే. ఆ సిరీస్‌లో అతను మూడు సెంచరీలు సాధించాడు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డున్న భారత్‌ను 2-1తో ఓడించి సంచలనం రేపింది ఇంగ్లాండ్. ఆ తర్వాత పదేళ్లలో మరే జట్టూ భారత్‌ను భారత గడ్డపై ఓడించింది లేదు. ఈ అరుదైన విజయం బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అలిస్టర్ కుక్ కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు