Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్‌-కెప్టెన్‌’ రోహిత్‌ ఏం చేస్తాడో?

ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి.

Published : 24 Mar 2024 14:34 IST

ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఆ జట్టును తొలి ఏడాదే ఛాంపియన్‌గా నిలిపాడు.. రెండో సీజన్‌లోనూ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. మూడో ఎడిషన్‌నాటికి జట్టు మారిపోయాడు. మరొక టీమ్‌కు కెప్టెన్‌ అయిపోయాడు. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఆ ప్లేయర్‌ హార్దిక్‌ పాండ్య అని.. పాత జట్టు గుజరాత్‌. ఇప్పుడు సారథిగా నియమితుడైన టీమ్‌ ముంబయి. నేడు ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. 

రోహిత్‌పైనే దృష్టి..

హార్దిక్‌ నాయకత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. హిట్‌మ్యాన్‌ను సారథ్యం నుంచి తప్పించి హార్దిక్‌ను నియమించడంపై నెట్టింట సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఒకదశలో రోహిత్ సీజన్‌ ఆడకపోవచ్చనే వార్తలూ వచ్చాయి. అయితే, ప్రాక్టీస్‌ సందర్భంగా రోహిత్-హార్దిక్‌ హగ్‌ చేసుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రోహిత్ ఆడటం ఖాయమని తేలిపోయింది. ఇక బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌ కూడా ముమ్మరంగా సాధన చేశాడు. టీ20ల్లో టాప్‌ర్యాంకర్ సూర్యకుమార్‌ యాదవ్ ఇంకా ఫిట్‌నెస్‌ సాధించలేదు. టీ20 ప్రపంచ కప్‌లో చోటే లక్ష్యంగా తిలక్‌ వర్మ బరిలోకి దిగుతున్నాడు. 

బుమ్రా, కొయిట్జీ గెరాల్డ్‌, క్వెనా మఫాకా త్రయంతో కూడిన పేస్ దళం ముంబయి సొంతం. వారితోపాటు హార్దిక్ పాండ్య ఫాస్ట్‌ బౌలింగ్‌ వేయడం కలిసొచ్చే అంశమే. అయితే, అతడు ఈసారైనా పూర్తి ఓవర్ల కోటాను సంధిస్తాడో లేదో చూడాలి.  నబీ, పీయూశ్ చావ్లాతో కూడి స్పిన్ విభాగం బాగుంది. గుజరాత్‌ జట్టులోని హిట్టర్లను అడ్డుకోవాలంటే ఇంకాస్త శ్రమించాలి. యువ తెందూల్కర్‌ అర్జున్‌ను ఈసారి ఎలా వినియోగించుకుంటారనేది ఆసక్తికరం.

వారిద్దరు లేకపోవడం నష్టమే.. కానీ

గత రెండు సీజన్లలో జట్టును నడిపించిన హార్దిక్ పాండ్య గుజరాత్‌లో లేడు. పేస్‌ విభాగంలో కీలకమైన మహమ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు.అయినా ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదు. క్లాస్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ తొలిసారి భారీ లీగ్‌లో సారథ్యం నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వృద్ధిమాన్‌ సాహా, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ మిల్లర్, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్ వంటి హార్డ్‌ హిట్టర్లు గుజరాత్ సొంతం. భారత సీనియర్‌ పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ను గత మినీ వేలంలో ఆ జట్టు తీసుకుంది. అతడితోపాటు మోహిత్ శర్మ, జాషువా లిటిల్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌తో ముంబయిని అడ్డుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్‌ రషీద్‌ ఖాన్‌తోపాటు నూర్ అహ్మద్‌ స్పిన్‌ విభాగాన్ని నడిపించనున్నారు. 

తుది జట్లు (అంచనా)

ముంబయి: ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్‌ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వధేరా, నబీ, బుమ్రా, గెరాల్డ్‌ కొయిట్జీ, పీయూష్‌ చావ్లా

గుజరాత్: శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని