GT vs MI: ఫైనల్‌కు గుజరాత్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గిల్
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇంటిముఖం పట్టింది. రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ చేతిలో 62 పరుగుల తేడాతో (GT vs MI) చిత్తుగా ఓడిపోయింది. గుజరాత్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (61), తిలక్ వర్మ (43), కామెరూన్ గ్రీన్ (30) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడం.. ఇషాన్ కిషన్ గాయం కారణంగా ఆడకపోవడం ముంబయికి ఇబ్బందిగా మారింది. గుజరాత్ బౌలర్లు మోహిత్ శర్మ 5 వికెట్లు.. షమీ 2, రషీద్ ఖాన్ 2, జాషువా లిటిల్ ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 233/3 స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతోపాటు సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్య (28*) దూకుడుగా ఆడేశారు. ఆదివారం టైటిల్ కోసం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.