ODI WC 2023: క్రికెట్‌ మహాసంగ్రామం.. ఈ రికార్డులపై గురి..!

నేటి నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

Updated : 05 Oct 2023 09:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టు సమష్ఠిగా రాణించాల్సిందే. అదేవిధంగా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టు విజయాల్లో కీలకం. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ సంగ్రామం గురువారం నుంచి మొదలు కానుంది. ఇది కూడా ఓ ఘనతే. ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఈ టోర్నీని భారత్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సారి మెగా టోర్నీలో క్రికెటర్లు రికార్డులు బద్దలు కొడతారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

  1. రోహిత్ శర్మ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్డ్‌ హిట్టింగ్‌ తెలిసిందే. సిక్స్‌లను మంచినీళ్లు తాగినంత సులువుగా బాదడంలో ప్రసిద్ధుడు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్‌గేల్‌ అత్యధికంగా 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సులు బాదాడు. ఆ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్‌ కేవలం 471 ఇన్నిగ్స్‌ల్లో 551 సిక్సులు బాదాడు. మరో మూడు సిక్స్‌లు కొడితే క్రిస్‌గేల్‌ ప్రపంచ రికార్డు బద్దలవుతుంది. ఇప్పటికే వన్డేల్లో రోహిత్ 292 సిక్స్‌లతో మూడోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌లో వెయ్యి పరుగులు చేసేందుకు రోహిత్‌కు 22 పరుగులు అవసరం. ప్రస్తుతం రోహిత్ 978 రన్స్‌తో కొనసాగుతున్నాడు. ఇక మరో శతకం చేస్తే.. ప్రపంచకప్‌ టోర్నిలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్‌ (6) రికార్డును హిట్‌మ్యాన్‌ సమం చేశాడు. 
  2. విరాట్ కోహ్లీ: ప్రస్తుతం విరాట్ ఖాతాలో 47 వన్డే సెంచరీలు (269 ఇన్నింగ్స్‌లు) ఉన్నాయి. మరో మూడు చేస్తే శతకాల సంఖ్య హాఫ్ సెంచరీకి చేరుతుంది. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల (452 ఇన్నింగ్స్‌లు) రికార్డును ఈ క్రికెట్‌ కింగ్‌ అధిగమిస్తాడు. వన్డేలో 50 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా అవతరిస్తాడు. విరాట్‌ ఒక్క క్యాచ్‌ పడితే వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా మారతాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 26 ఇన్నింగ్స్‌ల్లో 14 క్యాచ్‌లు పట్టి అనిల్ కుంబ్లే రికార్డును ఇప్పటికే సమం చేశాడు.
  3. జోస్ బట్లర్‌: వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ 4,823 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 11 సెంచరీలు, 25 అర్ధశతకాలు ఉన్నాయి. మరో 177 పరుగులు చేస్తే 5000 పరుగుల జాబితాలోకి చేరతాడు. 
  4. జో రూట్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్ జో రూట్ కూడా ఓ అరుదైన ఘనతకు కాస్త సమీపంలో ఉన్నాడు. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 758 పరుగులు చేసిన రూట్.. మరో 140 పరుగులు చేస్తే చాలు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. గ్రాహం గూచ్ 21 ఇన్నింగ్స్‌ల్లో 897 పరుగులతో వరల్డ్‌ కప్‌ల్లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 
  5. డేవిడ్‌ వార్నర్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్ మరో 8 పరుగులు చేస్తే వరల్డ్‌ కప్‌ పోటీల్లో వెయ్యి పరుగులు చేసిన ఆ దేశానికి చెందిన నాలుగో బ్యాటర్‌గా అవతరిస్తాడు. గతంలో రికీ పాంటింగ్‌ (1,743), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (1,085), మార్క్‌ వా (1,004) మాత్రమే ముందున్నారు. అలాగే వార్నర్‌ మరో రెండు సెంచరీలు చేస్తే వరల్డ్ కప్ ఈవెంట్లలో అత్యధిక శతకాలు బాదిన ఆసీస్‌ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. వార్నర్‌ 4 సెంచరీలు చేయగా.. రికీ పాంటింగ్‌ 5 సెంచరీలు సాధించాడు. 
  6. మిచెల్ స్టార్క్‌: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచుల్లో 49 వికెట్లు తీశాడు. మరొక వికెట్ తీస్తే ఆసీస్‌ తరఫున 50 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అవుతాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 39 మ్యాచుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. దానిని అందుకోవడానికి స్టార్క్‌కు 23 వికెట్లు అవసరం. 
  7. ట్రెంట్ బౌల్ట్‌: ఈ కివీస్‌ పేసర్ వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లోకి చేరేందుకు మూడు వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతం 104 మ్యాచుల్లో 197 వికెట్లతో కొనసాగుతున్నాడు. కివీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌ డానియల్ వెట్టోరి (291 మ్యాచుల్లో 273 వికెట్లు). ఈ వరల్డ్‌ కప్‌లో బౌల్ట్ మరో 18 వికెట్లు తీస్తే కివీస్‌ తరఫున అత్యధికంగా వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు. వెట్టోరి తర్వాత మిల్స్‌ (240), టిమ్‌ సౌథీ (214) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 
  8. టీమ్‌ఇండియా: ఈ సారి సెంటిమెంట్‌ భారత్‌ పక్షాన ఉంది. వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంటే గత మూడు కప్పుల్లోని సంప్రదాయాన్ని కొనసాగించిన జట్టుగా నిలుస్తుంది. గత మూడు వన్డే వరల్డ్‌ కప్‌లను ఆతిథ్య జట్లే గెలుచుకోవడం విశేషం. ధోనీ నాయకత్వంలో 2011 వరల్డ్ కప్ (భారత్, శ్రీలంక, బంగ్లా ఆతిథ్యం), 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌గా నిలిచాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు