IPL 2024: ‘‘ఐపీఎల్ కప్‌ కొట్టడం.. సంబరాలు చేసుకున్నంత సులువు కాదు’’

కీలకమైన ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. ఈసారైనా కప్‌ను కొట్టాలనే ఆశలకు బ్రేక్‌ పడింది. ఈ క్రమంలో సీఎస్కే మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Updated : 05 Jun 2024 12:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ ప్లేఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో పరాభవంతో టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టును ఉద్దేశించి సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌లో చెన్నైను ఓడించిన అనంతరం సంబరాల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోనీతోపాటు సీఎస్కే ఆటగాళ్లు మైదానంలో ప్రవేశించినా ఆర్సీబీ ప్లేయర్లు ఆలస్యంగా రావడంతో వారి కరచాలనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పుడు మరోసారి ఆ సందర్భాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘దూకుడుగా ఉండటం, సంబరాలు చేసుకోవడం వల్ల ఐపీఎల్‌ ట్రోఫీలను గెలవలేం. కేవలం సీఎస్కేను ఓడించినంత మాత్రాన కప్‌ను సొంతం చేసుకున్నట్లు కాదు. ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గాలంటే ప్లేఆఫ్స్‌కు చేరితేనే సరిపోదు. అక్కడా మంచి ప్రదర్శన ఇవ్వాలి’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. అలాగే తన సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్టు పెట్టాడు. ‘కొన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని క్యాప్షన్ ఇచ్చాడు.

నిరాశే కానీ.. కుర్రాళ్లు అదరగొట్టారు: ఏబీడీ

‘‘కష్టపడి ప్లేఆఫ్స్‌కు వచ్చాక.. ఇలాంటి ఫలితం ఎదురైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. అయితే, ఆర్సీబీ అభిమానిగా కుర్రాళ్ల శ్రమ పట్ల గర్వంగా ఉంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు అతి తక్కువగా ఉన్నప్పటి నుంచి నాకౌట్‌కు చేరినంత వరకు ప్లేయర్లు పట్టుదల ప్రదర్శించడం అభినందనీయం. తప్పకుండా వచ్చే సీజన్‌లో మరింత బలంగా బెంగళూరు జట్టు తిరిగి వస్తుందని నమ్ముతున్నా. టైటిల్‌ సాధిస్తుందని విశ్వసిస్తున్నా’’ అని ఒకప్పటి ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్‌ను ఆర్‌ఆర్‌ 19 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. దీంతో హైదరాబాద్‌తో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తలపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని