RCB - Ambati Rayudu: వ్యక్తిగత మైలురాళ్ల కంటే.. జట్టు కోసం ఆడేవారిని ఎంచుకోండి: ఆర్సీబీకి రాయుడు సెటైర్

సీఎస్కేపై ఓవర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాక జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టును టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోలింగ్‌ అవుతోంది.

Published : 24 May 2024 15:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టు తీరుపై కామెంట్లు చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్, సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని విమర్శిస్తూనే.. ఆ జట్టు అభిమానులపై ప్రశంసలు కురిపించాడు. 

‘‘బెంగళూరు జట్టును అభిమానించే ప్రతీ అభిమానికి అభినందనలు చెబుతా. టోర్నీ ఆరంభం నుంచి ఆ టీమ్‌ను ప్రేమిస్తూ వస్తున్నారు. ఒక్కసారి కూడా కప్‌ గెలవకపోయినా అభిమానించడం నిజంగా గర్వకారణం. అయితే, మేనేజ్‌మెంట్‌తోపాటు ఆ జట్టు సారథులు వ్యక్తిగత మైలురాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారనిపిస్తోంది. లేకపోతే ఇప్పటికే ఆర్సీబీ టైటిళ్లను గెలిచేది. ఆ జట్టులో చాలామంది అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. జట్టు ఆశలను ముందుకు తీసుకెళ్లే ఆటగాళ్లను ఆడించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్ పైన ఉంది. తప్పకుండా మెగా వేలం నుంచి ఆర్సీబీ కొత్త చాప్టర్‌ ఘనంగా ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా’’ అని ఎక్స్‌ వేదికగా రాయుడు పోస్టు పెట్టాడు. 

కేవలం పేస్‌ మాత్రమే సరిపోదు: ఆర్సీబీ కోచ్

ఐపీఎల్‌ నుంచి తమ జట్టు ఎలిమినేట్‌ కావడంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన బౌలర్ల అవసరం ఉంది. కేవలం పేస్‌తోనే వికెట్లను తీయడం, పరుగులను నియంత్రించడం సాధ్యం కాదు. వైవిధ్యంగా బంతులేసే నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ఇప్పుడే ఏం చెప్పలేను. అయితే, చిన్నస్వామి స్టేడియానికి తగ్గట్టుగా బౌలింగ్‌ వేసే సత్తా కలిగిన బౌలర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బంది లేదు. టీ20 క్రికెట్‌కు కావాల్సిన పవర్ హిట్టింగ్‌ మా జట్టులో ఉంది. ఇంపాక్ట్‌ రూల్‌ వల్ల అదనంగా ఇద్దరు భారత క్రికెటర్లకు ఆడే అవకాశం వస్తుంది. తప్పకుండా టీమ్‌ఇండియాకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని భావిస్తున్నా’’ అని ఫ్లవర్‌ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని