Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ (IPL 2023) మినహా మొన్నటి వరకు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు అంబటి రాయుడు (Ambati Rayudu). ఈసారి మాత్రం ఘోరంగా విఫలం కావడం అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఐపీఎల్‌కూ వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.

Updated : 29 May 2023 15:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుంటూరు అతడి ఊరు.. మిర్చిలాంటి ఘాటు అతడి బ్యాటింగ్‌తోపాటు మాటల్లోనూ కనిపిస్తుంది.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. తన ఆటతీరుతోనే కాకుండా మైదానం వెలుపలా దూకుడైన ప్రవర్తనతో పాపులర్‌ అయిన తెలుగు క్రికెటర్‌. ఎలాంటి విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండే స్వభావం అతడి సొంతం. తాజాగా ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇంకాస్త సమయం ఉందనగా ఈ మెగా లీగ్‌ నుంచీ రిటైర్‌ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. అతడే ‘గుంటూరు మిర్చి’ అంబటి రాయుడు (Ambati Rayudu). మరి ఈ ఘాటైన ఆటగాడి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

లక్ష్మణ్‌ తర్వాత..

అజారుద్దీన్, ఎంఎస్కే ప్రసాద్, వెంకటపతిరాజు వీరంతా ఒకతరం. ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ చాన్నాళ్లపాటు టీమ్‌ఇండియాకు ఆడాడు. లక్ష్మణ్‌ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన క్రికెటర్‌గా అంబటి రాయుడు అందరికీ సుపరిచితుడు. వేణుగోపాల్‌రావు, హనుమ విహారి వంటి వారు ఉన్నప్పటికీ.. రాయుడు మాదిరిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకోలేదు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించేసిన రాయుడు.. తాజాగా ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికినట్లు సంచలన ప్రకటన చేశాడు.

తొలిసారి అలా.. 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 1985 సెప్టెంబర్ 23న జన్మించిన రాయుడు.. 16 ఏళ్ల వయసులో మొదటిసారి 2001లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA)తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు ఏసీసీ అండర్ -15  ట్రోఫీ (2000లో) విజేత జట్టులో సభ్యుడు. పాక్‌పై  ఫైనల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం మూడో రంజీ మ్యాచ్‌లోనే 159, 210 పరుగులు సాధించాడు. అదీనూ ఆంధ్రా జట్టుపై కావడం గమనార్హం. ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, శతకం బాదిన అతిపిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దీంతో కేవలం రెండేళ్లకే భారత్ - ఏ జట్టులోకి ఆహ్వానం అందింది. 2003లో విండీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో అతడి ప్రదర్శనను చూసిన విశ్లేషకులు ‘త్వరలోనే భారత్‌ జట్టుకు ఆడతాడు. మిడిలార్డర్‌లో కీలకమవుతాడు’ అని చెప్పారంటే మనోడి టాలెంట్‌ ఏ రేంజ్‌లో ఉందో చూడండి. శిఖర్ ధావన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌, రాబిన్ ఊతప్పలతో కలిసి అండర్ -19 ప్రపంచకప్‌లో ఆడాడు.

శివలాల్‌ కుమారుడిపై దాడి

నాలుగేళ్లపాటు (2001-2005) హైదరాబాద్‌ జట్టుకు ఆడిన రాయుడు ఆ తర్వాత ఆంధ్రాకు మారిపోయాడు. హైదరాబాద్‌ కోచ్‌ రాజేశ్‌ యాదవ్‌తో విభేదాలతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే 2005-2006 సీజన్‌లో ఆంధ్రా - హైదరాబాద్ మ్యాచ్‌ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్ కుమారుడు అర్జున్‌ యాదవ్‌పై స్టంప్స్‌తో దాడి చేసినట్లు వార్తల్లో నిలిచాడు. కేవలం ఒక్క సీజన్‌ మాత్రమే ఆంధ్రా తరఫున ఆడాడు. ఆ తర్వాత వివేక్ జైసింహా కోచ్‌గా రావడంతో మళ్లీ హైదరాబాద్‌ జట్టులోకి వచ్చాడు. బరోడా తరఫునా రంజీల్లో మ్యాచ్‌లు ఆడాడు. 

బీసీసీఐకి కోపం తెప్పించేలా..

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు వస్తున్న ఆదరణను గుర్తించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ లీగ్‌ను కొత్తగా రూపొందించింది. ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ICL) అని నామకరణం చేసింది. అయితే, దీనికి భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (BCCI) అనుమతి ఇవ్వలేదు. అందులో ఆడిన ఆటగాళ్లపై నిషేధం పడుతుందని హెచ్చరించింది. వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ ఐసీఎల్‌లో అంబటి రాయుడు ఆడాడు. ‘‘పదేళ్లు దేశీయ క్రికెట్‌ ఆడాలని లేదు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా నాణ్యమైన ప్రత్యర్థులతో ఆడలేదు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇదంతా టీవీల్లో అభిమానులు చూస్తారు’’అని అప్పుడు వ్యాఖ్యానించాడు. దీంతో అతడిపై బీసీసీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత బీసీసీఐ కూడా ఐపీఎల్‌ను ప్రారంభించడం.. ఐసీఎల్‌ మూతపడిపోవడం జరిగిపోయాయి. ఐసీఎల్‌లో ఆడిన 79 మంది ఆటగాళ్లకు క్షమాభిక్ష పెట్టడంతో మళ్లీ రాయుడు దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు. 

ఐపీఎల్‌లోకి ఎంట్రీ

బీసీసీఐ నిర్ణయంతో కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రారంభమైన మూడో సీజన్‌లో (2010లో) ముంబయి ఇండియన్స్‌ జట్టుకు రాయుడు ఎంపికయ్యాడు. దాదాపు ఏడేళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఎంపికవ్వడం, బరోడా తరఫున రంజీ క్రికెట్ ఆడటం కలిసొచ్చింది. ముంబయి టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌ వేలంలో (2018) రాయుడిని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు కొనుగోలు చేసుకుంది. ఇప్పటి వరకు 203 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రాయుడు 4,329 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో మాత్రం గొప్పగా రాణించలేకపోయాడు. 

త్రీడీ వ్యాఖ్యలు

2013లో అంబటి రాయుడు భారత వన్డే జట్టుకు ఎంపిక కాగా.. జింబాబ్వే మీద తొలి మ్యాచ్‌ ఆడాడు. మిడిలార్డర్‌లో రాణించినా.. 2015 వన్డే ప్రపంచకప్‌ జట్టులో అవకాశం రాలేదు. కానీ, 2019 వన్డే ప్రపంచకప్ స్క్వాడ్‌లో తప్పకుండా ఉండే ఆటగాళ్ల జాబితాలో రాయుడు కూడా ఒకడు. చివరి నిమిషం వరకు కూడా జట్టులోకి వస్తాడని అంబటితోపాటు చాలామంది భావించారు. తీరా జట్టును ప్రకటించిన తర్వాత విజయ్‌ శంకర్‌ జట్టులోకి వచ్చాడు. ఎంఎస్కే ప్రసాద్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్నప్పటికీ రాయుడుకు అవకాశం దక్కలేదు. దీంతో విజయ్ శంకర్‌ను ఉద్దేశించి రాయుడు ‘త్రీడీ ప్లేయర్‌’ అంటూ కామెంట్లు చేశాడు. త్రీడీ గ్లాస్‌ ఆర్డర్‌ చేశా. వాటితోనే ప్రపంచకప్‌ను చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీంతో బీసీసీఐకి ఆగ్రహం రావడంతో రాయుడు అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు కార్డు పడింది. ఆ వెంటనే రిటైర్మెంట్‌ ప్రకటించి యూ-టర్న్‌ తీసుకున్నాడు.

ఇవీ మరికొన్ని వివాదాలు.. 

అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. ముక్కు మీద కోపం చేటు అన్నట్లుగా వివాదాలూ రాయుడు చుట్టూ ముసురుకున్నాయి. రంజీ ట్రోఫీ సమయంలోనే (2005లో) అర్జున్‌పై దాడి వ్యవహారం చోటుచేసుకుంది. ఆ తర్వాత 2012 ఐపీఎల్‌ సీజన్‌లో ప్రత్యర్థి ఆటగాడు హర్షల్‌ పటేల్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాయుడిపై వందశాతం మ్యాచ్‌ ఫీజు జరిమానాగా పడింది. ఓ సీనియర్‌ సిటిజన్ పట్ల (2017లో) అనుచితంగా ప్రవర్తించి దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి.  ఇక 2018లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంపైర్లతో వాగ్వాదం చేసినందుకు బీసీసీఐ అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని