WI vs IND: విండీస్‌లో కొత్త నీరెక్కువ.. మరి భారత్‌కు పోటీ ఇవ్వగలదా..?

బుధవారం నుంచి విండీస్‌తో భారత్‌ రెండు టెస్టుల (WI vs IND) సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవల వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లోనూ విండీస్‌ విఫలమై అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైన విండీస్‌ ఏమేర రాణిస్తుందనేది ప్రశ్నార్థకమే!

Updated : 11 Jul 2023 15:17 IST

‘‘మా జట్టులోని యువ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. తప్పకుండా భారత్‌కు పోటీనిస్తాం’’ ఇవీ విండీస్‌ మెంటార్‌ బ్రియాన్‌ లారా వ్యాఖ్యలు. 

జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరచడానికి, మానసికంగా ధైర్యం నింపడానికే లారా అలా వ్యాఖ్యానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్‌ను ఎదుర్కోవడం తేలికైన విషయమేం కాదు. విండీస్‌ స్క్వాడ్‌లోనూ పేరొందిన ప్లేయర్లూ తక్కువే. అలాంటి వెస్టిండీస్‌ టీమ్‌ భారత్‌కు పోటీనివ్వగలదా..? మరి విండీస్‌తో ఆడటం వల్ల టీమ్‌ఇండియాకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.. 

ఇప్పటి వరకు ఇరు జట్లు 98 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 22 మ్యాచ్‌లు, విండీస్‌ 30 మ్యాచుల్లో గెలిచాయి. మిగిలిన 46 డ్రాగా ముగిశాయి. ఇదంతా గతం.. 1990ల వరకు విండీస్‌ జట్టంటే ప్రత్యర్థికి వణుకు పుట్టేదే. రిచర్డ్స్‌, క్లైవ్‌లాయిడ్‌, సోబెర్స్‌, గ్రీనిడ్జ్‌, ఆంబ్రోస్‌, కోట్నీ వాల్ష్ వంటి భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టులో ఉండేవారు. ఆ తర్వాత చంద్రపాల్, లారా, జిమ్మీ ఆడమ్స్, కార్ల్‌ హోపర్, శర్వాన్, బ్రావో, గేల్, రామ్‌దిన్‌ వంటి ఆటగాళ్లు విండీస్‌ క్రికెట్‌ చరిత్రను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం దాదాపు కొత్తవారితోనే మళ్లీ క్రికెట్‌ను ఆడుతున్నట్లుగా విండీస్‌ పరిస్థితి తయారైంది. 

నలుగురు మాత్రమే కాస్త..

విండీస్‌ జట్టులో నలుగురు మాత్రమే భారత క్రికెటర్లకు పరిచయమున్న క్రికెటర్లు. వారిలో కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్ (85 టెస్టులు), జాసన్ హోల్డర్ (65 టెస్టులు), అల్జారీ జోసెఫ్‌ (28 టెస్టులు), కీమర్‌ రోచ్ (77 టెస్టులు) ఉన్నారు. బ్లాక్‌వుడ్ కూడా 54 టెస్టులు ఆడినప్పటికీ.. మనకు కొంచెం కొత్తే. ఇక భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ ఆడింది తక్కువ మ్యాచ్‌లే కానీ ఫేమస్‌ అయిపోయాడు. అల్జారీ, కీమర్‌, జాసన్‌లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పరీక్షే. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడతారనేది టీమ్‌ఇండియా అంచనా వేయడం కష్టమే. కాబట్టి, భారత ఆటగాళ్లు తేలికగా తీసుకోకుండా ఆడితేనే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. 

భారత్‌కు ప్రయోజనం ఏంటి? 

కొత్త ఆటగాళ్లతో కూడిన విండీస్‌తో తలపడటం వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనం ఏంటనేది సగటు క్రికెట్ అభిమానికి వచ్చే సందేహం. టీమ్‌ఇండియా జట్టులో అనుభవజ్ఞులే ఎక్కువ. అలాగే యువ క్రికెటర్లకూ ఈసారి అవకాశం దక్కింది. రోహిత్, గిల్, విరాట్, రహానె వంటి సూపర్‌ బ్యాటర్లతోపాటు యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్, శ్రీకర్‌ భరత్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు. తుది జట్టులోకి వచ్చే యంగ్‌ క్రికెటర్లకు ఇదొక మంచి ఛాన్స్‌. సిరాజ్‌ నేతృత్వంలోని పేస్ దళంలో జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్‌ సైని, ముకేశ్‌ కుమార్‌ ఉన్నారు.

తమను నిరూపించుకుని తదుపరి సిరీస్‌ల కోసం రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఛెతేశ్వర్‌ పుజారా ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఓ రెండేళ్లలో సీనియర్లు ఒక్కొక్కరు ఆటను వదిలేసే అవకాశం నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఈ సిరీస్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి టెస్టు సిరీస్‌ను వినియోగించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అతడిపై వేటు పడే అవకాశాలూ లేకపోలేదు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023 -25 సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరాలంటే విజయాలు సాధించడం ముఖ్యం. 

సచిన్‌ సరసన కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలోకి చేరనున్నాడు. తుది జట్టులో విండీస్‌ ఆటగాడు త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్ వస్తే.. తండ్రీకుమారుడితో ఆడిన ఆటగాడిగా విరాట్ మారతాడు. పన్నెండేళ్ల కిందట తొలిసారి టెస్టుల్లోకి అడుగు పెట్టినప్పుడు విరాట్ విండీస్‌ ఆటగాడు శివనారాయణ్‌ చంద్రపాల్‌తో ఆడాడు. ఇప్పుడు త్యాగ్‌నారాయణ్‌తో కూడా కలిసి ఆడితే విరాట్‌ కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సరసన చేరతాడు. 1992లో ఆసీస్‌ మాజీ ఆటగాడు జెఫ్‌ మార్ష్‌తో తలపడిన సచిన్‌.. 2011/12 సమయంలోఆయన కుమారుడు షాన్‌ మార్ష్‌తో కూడా ఆడటం విశేషం.

స్క్వాడ్‌లు ఇవే: 

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, శ్రీకర్‌ భరత్, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్‌ కుమార్‌.

విండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌  (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనేజ్‌, త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, జోష్వా ద సిల్వా, షనోన్‌ గాబ్రియల్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికన్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు: టెవిన్‌ ఇమ్లాచ్‌, అకీమ్‌ జోర్డాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని