WI vs IND: ఇప్పటికీ కుర్రాడినే.. ఆ స్థానంలో ఆడటం సవాలే: రహానె

బుధవారం నుంచి విండీస్‌తో (WI vs IND) రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 

Published : 11 Jul 2023 13:01 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొట్టేసిన అజింక్య రహానెకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023)లో ఆడే అవకాశం దక్కింది. అందులోనూ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడంతో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు (WI vs IND) ఎంపిక కావడమే కాకుండా మళ్లీ వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తూ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడం విశేషం. బుధవారం నుంచి విండీస్‌తో డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజింక్య రహానె మాట్లాడాడు. అంతకుముందు కెప్టెన్‌ రోహిత్ శర్మ రిపోర్టర్‌గా మారి రహానెను ప్రశ్నలు అడిగాడు. సీనియర్‌గా యువ క్రికెటర్లకు ఎలాంటి సూచనలు ఇస్తావని రహానెను రోహిత్ ప్రశ్నించాడు. దీంతో జట్టులోకి పునరాగమనం, వైస్‌ కెప్టెన్సీ, యువ క్రికెటర్ల గురించి రహానె వివరించాడు. 

తేలిగ్గా తీసుకోం..

అద్భుతమైన సన్నద్ధతతో విండీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎదురు చూస్తున్నాం. జట్టులోని ఆటగాళ్లం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా సరదాగా ఆడేశాం. అయితే, విండీస్‌ను తేలిగ్గా తీసుకోం. గత కొన్నేళ్లుగా వారి సొంతమైదానంలో మంచి ప్రదర్శన ఇస్తోంది. మరీ ముఖ్యంగా టెస్టుల్లో కఠిన సవాల్‌ ఉంటుందని భావిస్తున్నాం. మా గేమ్‌ ప్లాన్‌తో వంద శాతం శ్రమించి విజేతగా నిలుస్తాం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ను ఘనంగా ప్రారంభిస్తాం.

ఇదీ చదవండి.. విండీస్‌తో మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

అతడు కీలకం

యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు జాతీయ జట్టులోకి పిలుపు రావడం ఆనందంగా ఉంది. దీని కోసం చాలా కఠినంగా శ్రమించాడు. ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. అతడు బ్యాటింగ్‌ తీరు అద్భుతం. అయితే, ఈ సందర్భంగా అతడికి చేసే సూచన ఒక్కటే.. తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకుంటూ స్వేచ్ఛగా ఆడాలని చెబుతా. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నామనే ఒత్తిడిని దరిచేరనీయకూడదు.

మూడో స్థానంలో.. 

జట్టులో మూడో స్థానం చాలా కీలకమైంది. ఛెతేశ్వర్ పుజారా గైర్హాజరీలో అక్కడ ఆడే వారికి మంచి అవకాశం దొరినట్లే. అయితే, వన్‌డౌన్‌లో నేను గతంలోనూ మంచి ఇన్నింగ్స్‌లే ఆడాను. వైస్‌ కెప్టెన్‌గా నాలుగైదేళ్లు బాధ్యతలు నిర్వర్తించా. మళ్లీ ఇప్పుడు జట్టులోకి వైస్‌ కెప్టెన్‌గా తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఇప్పటికీ నేను కుర్రాడినే. నాలో చాలా క్రికెట్‌ మిగిలే ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాణించా. దేశవాళీ క్రికెట్‌లోనూ నాణ్యమైన ఆటతీరును కనబరిచా. ఇప్పుడు నా ఆటను ఎంజాయ్‌ చేస్తున్నా. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే అని రహానె వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని