Anand Mahindra: అతడో ‘లెర్నింగ్‌ మెషిన్‌’.. గుకేశ్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

  క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన భారత యువ చెస్‌ ప్లేయర్‌ గుకేశ్‌ విజయంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. 

Updated : 22 Apr 2024 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ చెస్‌ ప్లేయర్‌ డి.గుకేశ్‌ (Gukesh) టైటిల్‌ నెగ్గి సరికొత్త చరిత్రను లిఖించాడు. అంచనాలు తలకిందులు చేసి 17 ఏళ్ల వయసులోనే విజయం సాధించి రికార్డు సృష్టించాడు. గుకేశ్‌ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. గుకేశ్‌ మేధను లెర్నింగ్‌ మెషిన్‌తో పోలుస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

చెస్‌ రారాజుగా పేరొందిన నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఈ టోర్నీ ప్రారంభం అవడానికి ముందు ప్లేయర్స్‌ ఆటతీరును అంచనా వేశారు. అందులో గుకేశ్‌ పేలవ ప్రదర్శన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని షేర్‌ చేసిన మహీంద్రా.. ‘‘2024 చెస్‌ టోర్నోలో అభ్యర్థుల ప్రదర్శనపై కార్ల్‌సన్‌ అంచనా వేసిన లిస్ట్‌ ఇది. టోర్నీకి ముందు ఆయన అంచనా వేయడం తప్పు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ తలకిందులయ్యాయి. గుకేశ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరు సమయానికి మేటిగా నిలుస్తాడని భావిస్తున్నా. గుకేశ్ మేధ ఆర్టిఫీషియల్‌ కాదు. కానీ కృత్రిమ మేధ అనేది ముఖ్యమైన లెర్నింగ్‌ మెషిన్‌. అలాగే గుకేశ్‌ కూడా..! ఈ సోమవారం ఇంతకంటే మంచి మోటివేషన్‌ మరొకటి ఉండదు’’ అని పోస్టు చేశారు.

యంగ్ ‘క్యాండిడేట్‌’గా గుకేశ్.. చరిత్ర సృష్టించిన చెస్‌ ప్లేయర్

కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన గుకేశ్‌.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. ఒకవేళ అందులోనూ విజయం సాధిస్తే అతిపిన్న వయసులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు.

గుకేశ్‌ టైటిల్‌ గెలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ‘‘గుకేశ్‌ అద్భుతమైన విజయం సాధించారు. ఇది అతని అసాధారణ ప్రతిభ, అంకితభావానికి నిదర్శనం. అతడి అత్యుత్తమ ప్రదర్శన.. ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది’’ అని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని