Gukesh: యంగ్ ‘క్యాండిడేట్‌’గా గుకేశ్.. చరిత్ర సృష్టించిన చెస్‌ ప్లేయర్

భారత యువ చెస్‌ ప్లేయర్‌ గుకేశ్‌ మరో రికార్డు సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ‘క్యాండిడేట్స్‌’ విజేతగా నిలిచాడు.

Updated : 22 Apr 2024 07:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి భారత ప్లేయర్ డి గుకేశ్ (Gukesh) చరిత్ర సృష్టించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. 13వ రౌండ్‌ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన అతడు.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్‌ కూడా డ్రా అయింది.  వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ టైటిల్‌ను సాధించాడు. 

చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు. ఈ విజయంతో గుకేశ్ చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. అందులోనూ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్‌ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు.

గుకేశ్‌.. గర్వంగా ఉంది: విశ్వనాథన్ ఆనంద్

‘‘అత్యంత పిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన గుకేశ్‌కు శుభాకాంక్షలు. చెస్‌ కుటుంబమంతా నీ ఘనతకు గర్వపడుతోంది. నువ్వు ఆడిన తీరు నన్ను వ్యక్తిగతంగా ఆకట్టుకుంది. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలవడం అభినందనీయం’’ అని విశ్వనాథన్ ఆనంద్‌ పోస్టు చేశారు. గుకేశ్‌ 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆనంద్‌ను వెనక్కి నెట్టి భారత్‌ టాప్‌ చెస్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని