Andre Russell: ‘మిలిటరీ తరహా కోచ్‌’ అంటూ వీజ్‌ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్

భారత్‌లో అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్‌పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 Mar 2024 09:54 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ కోచింగ్‌ విధానాలపై నమీబియా ఆటగాడు డేవిడ్‌ వీజ్‌ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వైరల్‌గా మారాయి. చంద్రకాంత్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. అతడివి మిలిటరీ తరహా కోచింగ్ పద్ధతులంటూ వీజ్‌ చేసిన వ్యాఖ్యలపై కోల్‌కతా స్టార్‌ ఆల్‌రౌండర్ ఆండ్రి రస్సెల్ స్పందించాడు. ఒక్కో కోచ్‌ శైలి భిన్నంగా ఉంటుందని.. చంద్రకాంత్‌కు రస్సెల్‌ మద్దతుగా నిలిచాడు. 

‘‘మేం గతేడాది నుంచి అతడితో కలిసి పనిచేస్తున్నాం. కొత్తగా ఎవరైనా కోచ్‌ పాత్రకు వచ్చినప్పుడు మొదట్లో ఇబ్బందులు ఉంటాయి. సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మనమంతా ప్రొఫెషనల్‌ క్రికెటర్లం. కోచ్‌ల ప్రణాళికలకు అనుగుణంగా మారాలి. అంతేకానీ, వారిపై ఫిర్యాదులు చేయడం సరైంది కాదు. ఫ్రాంచైజీ కోసం నావంతు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటా. అలాగే కోచ్‌గా ఆయన కూడా అద్భుత పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’’ అని ఆండ్రి రస్సెల్‌ వ్యాఖ్యానించాడు. 

బెంగళూరుతో కోల్‌కతా పోరు

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరును ఢీకొట్టనుంది. సొంతమైదానంలో దూకుడైన ఆటతీరుతో పంజాబ్‌ను మట్టికరిపించిన బెంగళూరును అడ్డుకోవాలంటే కోల్‌కతా ఇంకాస్త శ్రమించాలి. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫిన్‌ సాల్ట్ (54) మినహా కోల్‌కతా టాప్‌ఆర్డర్ విఫలమైంది. లోయర్‌ ఆర్డర్‌లో ఆండ్రి రస్సెల్ (64*)తోపాటు నమన్‌ దీప్ (35), రింకు సింగ్ (23) రాణించడంతో 200+ స్కోరు చేయగలిగింది. ఇటు బౌలింగ్‌లోనూ హర్షిత్ రాణా చివరి ఓవర్‌లో మ్యాజిక్‌ చేయడంతో స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ ఘోరంగా విఫలం కావడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి కూడా ధారాళంగా పరుగులు సమర్పించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని