Sunil Gavaskar: ఆండ్రి రస్సెల్‌ బెస్ట్‌.. కానీ, గంభీర్‌ రావడమే కోల్‌కతాకు ప్లస్‌: సునీల్ గావస్కర్

హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం సాధించడంలో ఆండ్రి రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. ఇటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాడు.

Published : 24 Mar 2024 11:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా బోణీ కొట్టింది. ఉత్కంఠపోరులో హైదరాబాద్‌పై విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఆండ్రి రస్సెల్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీశాడు. కోల్‌కతా విజయంలో రస్సెల్‌ కీలక పాత్ర పోషించినప్పటికీ.. మెంటార్‌గా గంభీర్‌ తిరిగి రావడమే ఆ జట్టుకు బలంగా మారిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

‘‘ఆండ్రి రస్సెల్ బాగా ఆడాడు. టాప్‌ ఆర్డర్‌లో కొందరు విఫలమైనప్పటికీ దూకుడైన బ్యాటింగ్‌తో కోల్‌కతాకు భారీ స్కోరు అందించాడు. అయితే, ఇక్కడ మరో అంశం గమనించాల్సి ఉంది. గంభీర్‌ మళ్లీ మెంటార్‌గా వచ్చిన తర్వాత కోల్‌కతాకు తొలి విజయం. అలాగే గత సీజన్‌లో పెద్దగా మెప్పించని రస్సెల్ నుంచి కీలక ఇన్నింగ్స్‌. తదుపరి మ్యాచుల్లోనూ రస్సెల్‌ ఇదే ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒక వేళ విఫలమైతే మాత్రం గంభీర్‌పై నిందలు వేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఈ మ్యాచ్‌లో రస్సెల్‌ బ్యాటింగ్‌ అద్భుతం.  భువనేశ్వర్‌ కుమార్‌ వంటి సీనియర్‌ బౌలర్‌ స్లో యార్కర్లను అద్భుతంగా సంధిస్తాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ ఎక్కువగా సాధన చేశాడు. కానీ, మ్యాచ్‌లో మాత్రం లెగ్‌సైడ్‌ వేయడంతో రస్సెల్‌కు ఈజీ అయిపోయింది. స్టాండ్స్‌లో బంతిని పంపే అతడిలాంటి భయకరమైన హిట్టర్‌కు బౌలింగ్‌ వేయడం కష్టమే’’ అని గావస్కర్‌ తెలిపాడు. 

గత రెండేళ్లు ఇబ్బంది పడ్డా: రస్సెల్

‘‘బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించి గతంలో ఔటయ్యేవాడిని. అలా కాకుండా సరైన పద్ధతిలో హిట్టింగ్‌ చేయాలని తెలుసుకున్నా. గత రెండేళ్లుగా బౌలర్లు నాపై తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలిగారు. పరుగుల కోసం నేను ఇబ్బంది పడ్డా. నా కోసం ప్రతి ఒక్కరూ ఏదొక ప్లాన్‌ వేసుకొని వస్తారని తెలుసు. కోల్‌కతాతో అనుబంధం మరిచిపోలేనిది. ఇంతకుముందు నేను బెంచ్‌కే పరిమితమైనప్పటికీ ఏదొకటి నేర్చుకొన్నా. ఈ ఇన్నింగ్స్‌తో నా జెర్సీకి అర్థం ఉందని నిరూపించుకున్నా. ఇదే ప్రదర్శనను టోర్నీ ఆసాంతం కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. హర్షిత్‌ రాణా బౌలింగ్‌ బాగుంది. ఒత్తిడిలోనూ ప్రత్యర్థిని కట్టడి చేయడం అద్భుతం’’ అని ఆండ్రి రస్సెల్‌ వెల్లడించాడు. అతడినే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని