IPL 2024: బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్‌ కుంబ్లే

పొట్టి ఫార్మాట్‌ వచ్చాక బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌ వంటి లీగుల్లో ఇది ఎక్కువైంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

Updated : 17 May 2024 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో 200+ స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు ఒక కారణమైతే... బౌండరీల లైన్లను తగ్గించడమూ మరో కారణమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. బ్యాటర్ల హవా కొనసాగుతున్న పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లు మానసికంగా కుంగిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని సూచనలూ చేస్తున్నారు. ఈ అంశంపై భారత క్రికెట్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు. 

‘‘ఈ సీజన్‌ బౌలర్లకు అత్యంత కష్టంగా మారింది. తొలి భాగంలో ప్రత్యర్థి బ్యాటర్ల దూకుడు ఎక్కువైంది. అందుకే, ప్రతి వేదికలో బౌండరీ లైన్ల పరిధిని పెంచాలి. పెద్ద బౌండరీలు ఉంటే బౌలర్లకు వెసులుబాటు ఉంటుంది. అందుకోసం డగౌట్‌ను స్టాండ్స్‌లోకి మార్చాలి. దానివల్ల కొన్ని సీట్లను నష్టపోవచ్చు. కానీ, ఇతర అంశాల్లో చాలా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. తొలి ఓవర్‌లోనే బంతి స్వింగ్‌ అవుతోంది. ఆ తర్వాత బ్యాటర్లదే హవా. అందుకే బ్యాటింగ్‌, బౌలింగ్‌ మధ్య సమతూకం చేయాల్సిన అవసరం ఉంది. ఇలానే కొనసాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే కొత్త కుర్రాళ్లెవరూ బౌలింగ్‌ను కెరీర్‌గా మలుచుకొనేందుకు ఆసక్తి చూపరు. ప్రతి ఒక్కరూ బ్యాటర్‌ అవుదామనే లక్ష్యంతోనే క్రికెట్‌లోకి అడుగు పెడతారు. మ్యాచ్‌లో బౌలర్లనూ భాగం చేయాల్సిందే. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారనే ఆశాభావంతో ఉన్నా. స్ట్రైయిట్‌ బౌండరీ కనీసం 70 గజాలు (64 మీటర్లు) ఉండాలి. మైదానం మధ్య నుంచి సమానంగా బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలి. అలాగే చుట్టూ 85 గజాలు (77 మీటర్లు) కంటే ఎక్కువ లేకుండా చూడాలి’’ అని కుంబ్లే వెల్లడించాడు.

ముంబయి కెప్టెన్సీ నిర్ణయంపై..

‘‘ముంబయి సారథ్య బాధ్యతలను ఒక్కసారిగా మార్పు చేయడంతోనే సమస్య మొదలైంది. ముంబయి జట్టుతో కెప్టెన్‌గా రోహిత్‌కు పదేళ్ల అనుబంధం ఉంది. ఈ ఏడాది కూడా అతడికే అవకాశం ఇచ్చి.. వచ్చే సీజన్‌ నాటికి హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదే కాదు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో వారు నాణ్యమైన క్రికెట్‌ ఆడలేకపోవడానికి కూడా ఇదొక కారణమని భావించలేం. అలాగని పక్కన పెట్టలేం. పాండ్య లేకపోవడంతో గుజరాత్ కెప్టెన్సీ గిల్‌కు దక్కింది. జట్టును సరైన మార్గంలో నడిపించడాన్ని కేవలం ఒక్క సీజన్‌తో తేల్చేయడం సరి కాదు. ఆ జట్టులో షమీ లేకపోవడం, ఇతర ఆటగాళ్లు గాయాలతో సతమతం కావడం జీటీకి ఇబ్బందిగా మారింది’’ అని చెప్పాడు.

కుల్‌దీప్‌ ప్రధాన స్పిన్నర్‌.. 

‘‘టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగుతుందా? అంటే చెప్పలేం. కానీ, కుల్‌దీప్‌ యాదవ్‌ మాత్రం తుది జట్టులో ఉంటాడు. అక్కడి పిచ్‌ పరిస్థితి తెలియనప్పుడు కూర్పు గురించి మాట్లాడలేం. ప్రతి మ్యాచ్‌లోనూ కుల్‌దీప్‌ ఆడతాడు. అతడు రిస్ట్‌ స్పిన్నర్‌. టీ20ల్లో ఇలాంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లో ఆల్‌రౌండర్‌గా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికర అంశమే’’ అని కుంబ్లే వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని