Wrestling Champion Antim Panghal: అమ్మాయి వద్దనుకుంటే.. ఛాంపియన్‌ పుట్టింది

రెజ్లింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్న అంతిమ్‌ చరిత్ర సృష్టించింది. దీని కోసం ఆమెతోపాటు కుటుంబం పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. అయితే, వరుసగా రెండుసార్లు అండర్ -20 ఛాంపియన్‌గా మారడంతో పేరు మారుమోగిపోయింది.

Published : 20 Aug 2023 16:53 IST

రెజ్లింగ్‌లో అంతిమ్‌ సంచలన ప్రదర్శన

హరియాణాలోని హిసార్‌ జిల్లా భాగన గ్రామంలోని ఓ మధ్య తరగతి కుటుంబం. రామ్‌ నివాస్, కృష్ణ కుమారి దంపతులకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మరో అమ్మాయి వద్దని, అబ్బాయి పుట్టాలని ఆశపడ్డారు. కానీ మళ్లీ ఆడపిల్లే జన్మించింది. ఇక ఆమెనే చివరి అమ్మాయి కావాలనే అర్థం వచ్చేలా ‘అంతిమ్‌’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అబ్బాయి పుట్టాడు. కానీ అప్పుడు వాళ్లు ఊహించలేదు.. ఆ చివరి అమ్మాయే రెజ్లింగ్‌లో సంచలనాలు సృష్టిస్తుందని.. ప్రపంచ ఛాంపియన్‌గా ఎదుగుతుందని! అవును.. ఆ అమ్మాయే అంతిమ్‌ పంగాల్‌. వరుసగా రెండు సార్లు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌. 

రెజ్లింగ్‌కు పేరుగాంచిన హరియాణా నుంచి వచ్చిన 19 ఏళ్ల అంతిమ్‌ పంగాల్‌.. మ్యాట్‌పై అసాధారణ ప్రదర్శనతో అబ్బురపరుస్తోంది. నిరుడు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. ఆ గెలుపు గాలివాటం కాదంటూ ఈ ఏడాది కూడా 53 కేజీల విభాగంలో టైటిల్‌ నిలబెట్టుకుని.. వరుసగా రెండు సార్లు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర నమోదు చేసింది. మొదటి నుంచి అంతిమ్‌ ఓ పోరాట యోధురాలు. అబ్బాయి కావాలని ఆశపడ్డ తల్లితండ్రులకు నాలుగో ఆడపిల్లగా జన్మించిన ఆమె.. ఆటలోనూ ఎన్నో అడ్డంకులు దాటింది. నాలుగో అమ్మాయిగా ఆమె పుట్టడంతో హరియాణాలో కొనసాగుతున్న ఆచారం ప్రకారం ‘అంతిమ్‌’ అని పేరు పెట్టారు. అలా పెడితే ఆ తర్వాత అబ్బాయి పుడతాడని అక్కడ నమ్ముతారు. ఆ తర్వాత ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. 

అంతిమ్‌ తండ్రి రామ్‌ ఒకప్పుడు కబడ్డీ ఆడేవాడు. ఆమె పెద్దక్క సరిత కూడా కబడ్డీ క్రీడాకారిణే. దీంతో అంతిమ్‌ను కూడా కబడ్డీ వైపే నడిపించాలని తండ్రి అనుకున్నాడు. కానీ ఆమెను రెజ్లర్‌ను చేయాలని సరిత పట్టుబట్టింది. దీంతో 20 కిలోమీటర్ల దూరంలోని హిసార్‌ నగరానికి తనయలిద్దరినీ రామ్‌ తీసుకుని వెళ్లేవాడు. ఆ తర్వాత మహావీర్‌ స్టేడియంలో అంతిమ్‌ శిక్షణ కోసం కుటుంబమంతా హిసార్‌కు మకాం మార్చింది. కానీ వ్యవసాయం చేసే రామ్‌ దగ్గర బర్రెలు కూడా ఉండేవి. వీటి కోసం హిసార్‌ బయట ఇల్లు కట్టాడు. స్వదేశంలో టోర్నీలు, శిక్షణ శిబిరాల కోసం అంతిమ్‌తో పాటు రామ్‌ వెళ్లి దగ్గర్లోనే అద్దెకు ఉండేవాడు. అంతిమ్‌ కెరీర్‌ కోసం టెంపో ట్రక్కు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్‌ కూడా అమ్మేశాడు.  

నమ్మకాన్ని నిలబెడుతూ.. 

కుటుంబ నమ్మకాన్ని నిలబెడుతూ అంతిమ్‌ త్వరగానే రెజ్లింగ్‌లో పట్టు సాధించింది. 11 ఏళ్లకే తనకంటే సీనియర్‌ రెజ్లర్లతో తలపడి గెలిచేది. ఆట కోసం అబ్బాయిల మాదిరే తలకట్టు తీయించుకోవాల్సి రావడంతో ఏడ్చింది. కానీ రెజ్లింగ్‌ ప్రాణంగా సాగే ఆమె ఇప్పటికీ సాధనలో తీవ్రంగా కష్టపడుతోంది. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్‌లోనే మునిగిపోతోంది. సహజంగానే అబ్బిన నైపుణ్యాలు, శక్తితో పతకాల వేటలో సాగుతోంది. 2018లో అండర్‌-15 జాతీయ టైటిల్‌ గెలిచిన తర్వాత అంతిమ్‌ తిరిగి చూసుకోలేదు. జాతీయ, ఆసియా స్థాయిలో సత్తాచాటింది. కరోనా సమయంలో తమ్ముడు అర్పిత్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేసేది. అర్పిత్‌ కూడా రెజ్లరే (గ్రీకో రోమన్‌). రాష్ట్ర అండర్‌-15 ఛాంపియన్‌షిప్‌లో అతను కాంస్యం నెగ్గాడు. 

మ్యాట్‌పై సత్తాచాటే అంతిమ్‌.. బయట కూడా యోధురాలే. ఈ ఏడాది ఆసియా క్రీడలకు బజ్‌రంగ్, వినేశ్‌ ఫొగాట్‌కు మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ వినేశ్‌ పోటీపడే 53 కేజీల విభాగంలోనే అంతిమ్‌ ఉంది. దీంతో ట్రయల్స్‌ లేకుండా నేరుగా ఎలా ఎంపిక చేస్తారంటూ అంతిమ్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీం కోర్టుకూ వెళ్దామనుకుంది. మరోవైపు ట్రయల్స్‌లో విజేతగా నిలిచింది. చివరకు వినేశ్‌ గాయం కారణంగా ఆసియా క్రీడల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో చైనా వెళ్లేందుకు అంతిమ్‌ సిద్ధమవుతోంది. ఆసియా క్రీడలు, ప్రపంచ సీనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటడంతో పాటు వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే అంతిమ్‌ లక్ష్యం.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని