Shreyas Iyer: 17వ ఓవర్‌ నుంచి టెన్షన్‌ మొదలైంది.. చివర్లో ఏదైనా జరగొచ్చని భావించా: శ్రేయస్‌

ఐపీఎల్‌లో ఉత్కంఠకు ఏమాత్రం ఢోకా ఉండదని మరోసారి నిరూపితమైంది. భారీ లక్ష్యమైనా సరే చివరి బంతి వరకూ ఇరు జట్లూ పోరాడటం విశేషం.

Published : 24 Mar 2024 07:52 IST

ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోరు చేసినా విజయం కోసం చివరి బంతి వరకూ కోల్‌కతా వేచి చూడాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత కోల్‌కతా 208 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 204 పరుగులకు పరిమితమైంది. చివరి మూడు ఓవర్లలో క్లాసెన్‌ పోరాటంతో టార్గెట్‌కు చేరువగా హైదరాబాద్‌ రాగలిగింది. అతడి ఇన్నింగ్స్‌ తమను బెంబేలెత్తించిందని.. అయితే, హర్షిత్‌ రాణా అద్భుత బౌలింగ్‌తో గట్టెక్కినట్లు కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వ్యాఖ్యానించాడు. 

‘‘చివరి ఓవర్‌లో హైదరాబాద్‌ విజయానికి కేవలం 13 పరుగులు మాత్రమే కావాలి. మరోవైపు పెద్దగా అనుభవం లేని యువ బౌలర్ ఉన్నాడు. అతడిపై నమ్మకం ఉంచాం. ఏం జరిగినా ఫర్వాలేదు.. నీ శైలిలో బౌలింగ్‌ చేయమని చెప్పా. 17వ ఓవర్‌ నుంచే క్లాసెన్‌ విజృంభణ మొదలైంది. దీంతో మాలోనూ కాస్త ఆందోళన రేగింది. అయితే, చివరి ఓవర్‌లో ఏదైనా జరగొచ్చని అనుకున్నా. హర్షిత్ కూడా తెలివిగా బంతులను సంధించాడు. తొలుత మేం భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం ఆండ్రి రస్సెల్. ఫామ్‌లో ఉంటే అతడు అత్యంత భయకరమైన బ్యాటర్. ఇటు బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చాటాడు. సునీల్ నరైన్‌ పదునైన బౌలింగ్‌తోపాటు ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ఎప్పుడూ మనల్ని ముందుకు వెళ్లేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మేం ఫీల్డింగ్‌లో కాస్త మెరుగవ్వాల్సి ఉంది. డీప్‌ వికెట్‌లోని ఫీల్డర్‌ పక్కవారికి సిగ్నల్‌ ఇవ్వడం సరైంది కాదు. తదుపరి మ్యాచుల్లో ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్‌ తెలిపాడు. 

విజయానికి చేరువగా వచ్చాం: కమిన్స్

‘‘ఇది అద్భుతమైన మ్యాచ్‌. భారీ లక్ష్యఛేదనలో చివరి వరకూ వచ్చాం. విజయంతో ముగిస్తే ఇంకా బాగుండేది. బౌలింగ్‌పరంగా సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే క్రీజ్‌లో ఆండ్రి రస్సెల్‌ ఉన్నప్పుడు ఎంతటి బౌలర్‌కైనా ఒత్తిడి తప్పదు. హార్డ్‌ హిట్టర్‌కు బంతులు వేయడం చాలా కష్టం. టార్గెట్‌లో మాకు మంచి ఆరంభమే దక్కింది. చివర్లో క్లాసెన్‌, షహబాజ్‌ పోరాటం అద్భుతం. దురదృష్టవశాత్తూ వారిద్దరూ ఔట్‌ కావడంతో స్వల్ప తేడాతో ఓడిపోయాం. కోల్‌కతా వంటి బలమైన జట్టుకు వారి సొంతమైదానంలో గట్టి పోటీనిచ్చాం. కొన్ని అంశాలపై వర్కౌట్‌ చేసి మిగతా మ్యాచుల్లో బరిలోకి దిగుతాం’’ అని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని