Lionel Messi: టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా మెస్సీ

ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్‌ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్‌గా ప్రకటించింది.

Updated : 06 Dec 2023 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ (Lionel Messi) మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. మెస్సీ ఈ ఏడాది జులైలో మియామి క్లబ్‌లో చేరాడు. మొత్తం 14 గేమ్స్‌ ఆడి 11 గోల్స్‌ కొట్టి జట్టును తొలిసారి లీగ్‌ విజేతగా నిలిపాడు. ‘‘గతంలో అసాధ్యంగా కనిపించిన వాటిని ఈ ఏడాది మెస్సీ సుసాధ్యం చేసి చూపించాడు. అతడు ఇంటర్‌ మియామి జట్టుకు సంతకం చేసి అమెరికాను ఏకంగా సాకర్‌ దేశంగా మార్చేశాడు’’ అని టైమ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్

మెస్సీ రాకతో ఎంఎల్‌ఎస్‌ టోర్నీ వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టైమ్‌  తెలిపింది. దీంతోపాటు టికెట్‌ ధరలు, విక్రయాలు కూడా బాగా పెరిగాయని పేర్కొంది. టైమ్‌ నుంచి గతంలో ఈ అవార్డు అందుకొన్న మైకెల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌), సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌) వంటి వారి సరసన మెస్సీ చేరాడు.

గతంలో పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. ఆ కాంట్రాక్టు ముగియగానే తన పుట్టిల్లు వంటి బార్సిలోనా క్లబ్‌లో తిరిగి చేరాలని భావించాడు. కానీ, అతడి ప్రణాళికలు ఫలించలేదు. దీంతో మియామి లేదా సౌదీ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నేపథ్యంలో 20 మిలియన్‌ డాలర్లకు మియామి ఒప్పందం చేసుకొంది. రిటైర్మెంట్‌ తర్వాత ఈ క్లబ్‌ యాజమాన్య వాటాలో కొంత భాగం అతడికి కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.

ఇటీవలే ఎనిమిదో సారి బాలన్‌ డి ఓర్‌ అవార్డును మెస్సీ దక్కించుకొన్నాడు. 2022-23కు గానూ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతోపాటు ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించిన మెస్సీనే ఈ అవార్డు అందుకున్నాడు. అత్యధిక సార్లు (8) ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అత్యధిక బాలన్‌ డి ఓర్‌ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో(5) రెండో స్థానంలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని