Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్‌ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్‌దీప్‌ వెల్లడి

డెత్‌ఓవర్ల హీరోగా అర్ష్‌దీప్‌ పదునుదేలుతున్నాడు. తాజా టీ20లో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆసీస్‌కు ఓటమిని మిగిల్చాడు. ఈ ఓవర్‌కు కెప్టెన్‌ సూర్య తనకు ఏమి చెప్పాడో వెల్లడించాడు. 

Published : 04 Dec 2023 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత యువ లెఫ్టార్మ్‌ సీమర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారత్‌-ఆసీస్‌ తుది టీ20లో హీరోగా ఆవిర్భవించాడు. చివరి ఓవర్లో 10 రన్స్‌ కాపాడాల్సి ఉండగా.. అర్ష్‌దీప్‌ కేవలం 3 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ (వేడ్‌) పడగొట్టి జట్టుకు విజయాన్నందించాడు. వాస్తవానికి ఈ ఓవర్‌ వేయడానికి ముందు ఈ యువసీమర్‌ మూడు ఓవర్లలో దాదాపు 37 పరుగులు ఇచ్చాడు. అయినా, కెప్టెన్‌ సూర్య ఇతడిపై నమ్మకం ఉంచి 20 ఓవర్‌ వేసి జట్టును గెలిపించే బాధ్యతను అప్పగించాడు. ఈ అనుభవంపై అర్ష్‌దీప్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ మ్యాచ్‌లో తొలుత ధారాళంగా పరుగులు ఇచ్చాను. కానీ, భగవంతుడి దయతో నాకు మరో అవకాశం వచ్చింది. జట్టు సపోర్టింగ్‌ స్టాఫ్‌ కూడా నాపై నమ్మకం ఉంచారు. మీరు నమ్మరుగానీ.. ఆ సమయంలో నేను ఏమీ ఆలోచించలేదు. సూర్య భాయ్‌ నా వద్దకు వచ్చి దైర్యం చెప్పాడు. ఏం జరగాలో అదే జరుగుతుంది.. నువ్వు బౌలింగ్‌ చేయి అన్నాడు. నేను కెరీర్‌లో చాలా పాఠాలు నేర్చుకొన్నాను. ఆ తర్వాత పుంజుకొన్నాను’’ అని అర్ష్‌దీప్‌ వెల్లడించాడు. 

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయగలిగేలా టీమ్‌ ఇండియా దాదాపు ఏడాది నుంచి అర్ష్‌దీప్‌ను సిద్ధం చేస్తోంది. కొన్ని సార్లు వైఫల్యాలున్నా.. అతడిని జట్టు యాజమాన్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 చివరి మ్యాచ్‌లో కూడా ఉత్కంఠభరితమైన 20 ఓవర్‌ వేసే బాధ్యతను కెప్టెన్‌ సూర్య అతడికే ఇచ్చాడు. 

మా కుర్రాళ్లు అన్ని రంగాల్లో రాణించారు..: సూర్య

సెలక్టర్లు తనకు సమకూర్చిన జట్టుపై కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. కుర్రాళ్లు అన్ని విభాగాల్లో రాణించి 4-1తేడాతో సమగ్ర విజయాన్ని అందుకొన్నారని అన్నాడు. ‘‘ఇది అద్భుతమైన సిరీస్‌. ఆటపై అన్ని విభాగాలను పూర్తి నియంత్రించారు. ఈ సిరీస్‌లో నిర్భయంగా ఆడాలని నిర్ణయించుకొన్నాం. ఇబ్బందికర పరిస్థితులను కూడా ఆస్వాదించాలని నిర్ణయించుకొన్నాం. ఏది కరెక్ట్‌ అయితే అది చేస్తూ.. మీ ఆటను ఎంజాయ్‌ చేయండని చెప్పాను. వాళ్లు అదే పాటించారు’’ అని సూర్యకుమార్‌ పేర్కొన్నాడు.

‘‘మ్యాచ్‌ 10 ఓవర్లు పూర్తయ్యక అసలు ఆట ఇప్పుడు మొదలైందని భావించాను. తొలి నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి తేమ ప్రభావం లేదు. నేను నా లయను అందుకొన్నాను’’ అని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని