IPL 2024: రుతురాజ్‌కు సీఎస్కే కెప్టెన్సీ.. ఇది సడెన్‌ నిర్ణయం కాదు: అశ్విన్

ఐపీఎల్ 17వ సీజన్‌ (IPL 2024) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీఎస్కే సంచలన నిర్ణయం తీసుకుంది.

Published : 22 Mar 2024 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఏం చేసినా అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తాడు. నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అంతకుముందు టీమ్‌ఇండియా కెప్టెన్సీని వదిలేయడమైనా సరే సడెన్‌గా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టు పగ్గాలను యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)కు అప్పగించాడు. ఈ నిర్ణయం మాత్రం ఇప్పటికప్పుడు తీసుకున్నది కాకపోవచ్చని టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ మార్పు వ్యవహారంపై రుతురాజ్‌తో ధోనీ గతేడాది చర్చించి ఉంటాడని అశ్విన్ పేర్కొన్నాడు.

‘‘సీఎస్కే కెప్టెన్‌ మార్పు ఏదో ఒక దశలో జరగాల్సింది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎప్పటికైనా తప్పదు. ధోనీ గురించి నాకు పూర్తిగా తెలుసు. జట్టును ముందుండి నడిపిస్తాడు. ఫ్రాంచైజీ బాగు కోసం ఆలోచిస్తాడు. రెండేళ్ల కిందటే కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. ఇప్పుడు రుతురాజ్‌ సారథిగా వచ్చాడు. ఈ విషయం అతడికి ముందే తెలిసి ఉంటుంది. దానికి కారణం ధోనీ. కుర్రాళ్లతో కూర్చుని మాట్లాడేటప్పుడు అన్ని విషయాలపై స్పందిస్తాడు. అలాగే గతేడాదే రుతురాజ్‌తో కెప్టెన్సీ గురించి చర్చించే ఉంటాడు. అందుకే, ఇప్పుడు సీఎస్కే తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. 

బాధ్యతలను అప్పగించే ముందు రుతురాజ్‌తో ధోనీ ‘బ్రదర్, నువ్వు సారథిగా బాధ్యతలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉండు. అన్నింటినీ చేయగలవు. నేను అక్కడే ఉంటా. కంగారు పడొద్దు’ అని చెప్పి ఉంటాడు. రుతురాజ్‌లోనూ ధోనీ లక్షణాలు చాలా ఉన్నాయి. కూల్‌గా ఉంటూ నిశ్శబ్దంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అతడిని నియమించడంపై చాలా సంతోషంగా ఉన్నా. తప్పకుండా కెప్టెన్‌గా రుతు సక్సెస్ అవుతాడనే నమ్మకం నాకుంది’’ అని అశ్విన్‌ తెలిపాడు. ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో సీఎస్కే (RCB vs CSK) నేడు తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని