Ashwin: హైదరాబాద్‌ కెప్టెన్సీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: అశ్విన్

ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. కోల్‌కతాతో హైదరాబాద్‌.. పంజాబ్ కింగ్స్‌తో దిల్లీ తలపడనున్నాయి.

Updated : 23 Mar 2024 15:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో కిందకి దిగజారింది. ఐదెన్ మార్‌క్రమ్‌ స్థానంలో కమిన్స్‌ను హైదరాబాద్‌ మార్చిన సంగతి తెలిసిందే. అయితే, కమిన్స్‌ నియామకంపై భారత సీనియర్‌ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.  

‘‘సన్‌రైజర్స్‌ వరుసగా రెండు టైటిళ్లను దక్కించుకుంది. దక్షిణాఫ్రికా 20 లీగ్‌లో ఆ ఘనత సాధించింది. అద్భుతమైన జట్లతో ఆకట్టుకుంది. కానీ, ఐపీఎల్‌కు వచ్చేసరికి ఆ జట్టు తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురి చేసింది. ప్యాట్ కమిన్స్‌ను హైదరాబాద్‌ టీమ్‌కు సారథిగా నియమించుకుంది. SA20 టీ20లో రెండు టైటిళ్లను అందించిన మార్‌క్రమ్‌ను జట్టులో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమేసింది. ఆటగాడిగా కమిన్స్‌ విషయంలో ఇబ్బందేమీ లేదు. కానీ, కెప్టెన్‌గా మాత్రం అతడితోపాటు జట్టుకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రావిస్‌ హెడ్‌ను బ్యాకప్‌గా పెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే మార్‌క్రమ్‌, కమిన్స్‌, క్లాసెన్, వనిందు.హసరంగ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని మైదానాల్లో హసరంగను వద్దనకుంటే.. ఫరూఖి లేదా మార్కో ఎన్‌సెన్‌లో ఒకరు ఉండాల్సిందే’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 


రిషభ్‌ అదరగొట్టేస్తాడు: రికీ పాంటింగ్‌

రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని వచ్చిన రిషభ్‌ పంత్ తొలిసారి మైదానంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. పంజాబ్‌తో దిల్లీ తలపడనుంది. ఈ క్రమంలో దిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘‘వైజాగ్‌లో మేం వారం రోజులపాటు ట్రైనింగ్‌ శిబిరం నిర్వహించాం. రిషభ్‌ పంత్ చాలా సౌకర్యంగా కనిపించాడు. తప్పకుండా అతడి నుంచి అద్భుతమైన క్రికెట్‌ను చూడబోతున్నాం. బ్యాటింగ్‌లోనే కాకుండా స్టంప్స్‌ వెనక చురుగ్గా కదిలాడు. కొన్నిసార్లు ఎక్కువ సమయం బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కానీ, నేను అతడిని పక్కకు తీసుకెళ్లేవాడిని. గతంలో ఎక్కడ ఆగిపోయాడో.. అక్కడినుంచే ప్రారంభమవుతుంది. జట్టు కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తన ప్రవర్తన, నవ్వులోనే తెలిసిపోతుంది’’ అని రికీ పాంటింగ్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని