IPL 2024: సన్‌రైజర్స్‌ ఆ నిర్ణయం తీసుకోవడంతో షాక్ అయ్యా: అశ్విన్‌

ఐపీఎల్ 2024 సీజన్‌ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) పాట్‌ కమిన్స్‌ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.

Updated : 20 Mar 2024 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచకప్‌, డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిపిన పాట్‌ కమిన్స్‌ను వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఐదెన్‌ మార్‌క్రమ్‌ స్థానంలో కమిన్స్‌ (Pat Cummins)ను కెప్టెన్‌గా నియమించింది. సన్‌రైజర్స్‌ మార్‌క్రమ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి భారత ఆటగాడు, రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడాడు. సౌతాఫ్రికా టీ20లీగ్‌ (SA20)లో సన్‌రైజర్స్‌కు వరుసగా రెండు టైటిళ్లు అందించిన మార్‌క్రమ్‌ను ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో షాక్‌కు గురయ్యానని అశ్విన్‌ పేర్కొన్నాడు.

‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్‌క్రమ్‌ సారథ్యంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌ కేప్‌ వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. అత్యద్భుతమైన జట్లతో ట్రోఫీలు అందుకుంది. కానీ, ఐపీఎల్‌లో మార్‌క్రమ్‌ను కాదని కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. నిజంగా ఇది నాకు షాకింగ్‌గా అనిపించింది. వారు (సన్‌రైజర్స్‌) మార్‌క్రమ్‌నే సారథిగా కొనసాగిస్తారని భావించా. కమిన్స్‌ను కెప్టెన్‌గా చేయడం వల్ల తుది జట్టు కూర్పులో సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రావిస్‌ హెడ్ బ్యాకప్‌గా ఉపయోగించుకున్నా. మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వానిందు హసరంగలను తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. హసరంగ అవసరం లేదని భావిస్తే కొన్ని మ్యాచ్‌ల్లో అతనికి బదులుగా ఫజల్‌హాక్ ఫారూకీ లేదా మార్కో జాన్సెన్‌ను ఆడించే ఛాన్స్‌ ఉంది. ఏది ఏమైనా విదేశీ ఆటగాళ్లను ఆడించడంలో సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు’’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో అన్నాడు. ఈ సీజన్‌లో ఆరెంజ్‌ ఆర్మీ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఢీకొట్టనుంది. మార్చి 23న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని