IND vs PAK: పాక్.. ఉఫ్!
చిరకాల ప్రత్యర్థి చిత్తు
ఆసియా కప్‌లో భారత్ ఘనవిజయం
విజృంభించిన కుల్‌దీప్, బుమ్రా, అక్షర్

భారత్, పాకిస్థాన్ పోరంటే ఎప్పుడూ ఉండే హంగామా లేకపోవచ్చు.. ఈ మ్యాచ్ పట్ల అభిమానుల్లో ఆసక్తి అంతంతమాత్రం కావచ్చు.. కానీ చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ఇండియా ఆధిపత్యంలో మాత్రం మార్పు లేదు.
మీరు మాకు పోటీయే కాదన్న తరహాలో ఆడిన భారత్.. పాక్‌ను అలవోకగా ఓడించింది. ఆసియా కప్‌లో వరుసగా రెండో ఘనవిజయం నమోదు చేసింది.
టాస్ పాక్‌దే అయినా.. ఆట మాత్రం భారత్‌దే. తొలి బంతి నుంచే విజృంభించిన భారత బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. కనీసం వందైనా చేస్తుందా అన్నట్లు ఆడిన పాక్.. అతి కష్టం మీద భారత్‌కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అది భారత బ్యాటర్లకు ఏ మూలకూ సరిపోలేదు. 25 బంతులుండగానే, 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదనను పూర్తి చేసింది సూర్యకుమార్ సేన.
దుబాయ్ : పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దంటూ ఓవైపు దేశవాప్తంగా నిరసన స్వరాలు కొనసాగుతుండగానే, ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆ జట్టుతో తలపడ్డ టీమ్‌ఇండియా.. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం పాక్‌పై 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ సూపర్-4లో స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లే. భారత బౌలర్లు సమష్టిగా విజృంభించంతో మొదట పాక్ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన కుల్‌దీప్ యాదవ్ (3/18)కు తోడు అక్షర్ పటేల్ (2/18), బుమ్రా (2/28), వరుణ్ చక్రవర్తి (1/24)ను పాక్‌ను దెబ్బ తీశారు. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (40; 44 బంతుల్లో 1×4, 3×6), టెయిలెండర్ షహీన్ షా అఫ్రిది (33 నాటౌట్; 16 బంతుల్లో 4×6) పోరాడకుంటే పాక్ ఆ మాత్రం స్కోరైనా చేసేది కాదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్; 37 బంతుల్లో 5×4, 1×6), అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4×4, 2×6), తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2×4, 1×6) మెరుపులతో లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ కోల్పోయిన మూడు వికెట్లూ స్పిన్నర్ సయిమ్ అయూబ్ (3/35) ఖాతాలోకే చేరాయి. టీమ్‌ఇండియా శుక్రవారం తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఢీకొంటుంది.
వికెట్లు పడ్డాయి కానీ..: ఛేదనలో పాక్ మూడు వికెట్లయితే తీసింది కానీ.. భారత్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఆ జట్టుకు ఏ దశలోనూ కాస్తయినా విజయావకాశాలు కనిపించలేదు. పాక్ ప్రధాన బౌలింగ్ అస్త్రమైన షహీన్ అఫ్రిది వేసిన ఆరంభ ఓవర్లో తొలి రెండు బంతులను 4, 6గా మలిచిన అభిషేక్ శర్మ.. ఛేదన ఎలా సాగబోతోందో సంకేతాలు ఇచ్చాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10) కూడా దూకుడుగానే బ్యాటింగ్ ఆరంభించాడు. స్పిన్నర్ అయూబ్ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ అదే ఊపులో ముందుకొచ్చి షాట్ కొట్టబోయి స్టంపౌటైపోయాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం పాక్ బౌలర్లను శిక్షించడం ఆపలేదు. దీంతో నాలుగో ఓవర్లోనే స్కోరు 40 దాటేసింది. కానీ అతను కూడా అయూబ్ వేసిన తర్వాతి ఓవర్లో ఔటైపోయాడు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కుదురుకున్నాక ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. 12 ఓవర్లలో 97/2తో భారత్ విజయానికి చేరువైంది. అప్పటికే నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న తిలక్.. అయూబ్‌కు మూడో వికెట్‌ను అందిస్తూ బౌల్డయ్యాడు. తర్వాత దూకుడు పెంచిన సూర్య.. దూబె (10 నాటౌట్)తో లాంఛనాన్ని పూర్తి చేశాడు.

టపటపా..: యూఏఈలో పిచ్‌లు, పరిస్థితులు మొదట బౌలింగ్ చేసే జట్లకే అనుకూలమన్న అంచనాలుండగా.. ఛేదనలో ఒత్తిడికి గురయ్యే అలవాటున్న పాకిస్థాన్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి మొదట బ్యాటింగే చేసింది. ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. హార్దిక్ బౌలింగ్‌లో తొలి బంతికే అయూబ్ ఔటైపోయాడు. రెండో ఓవర్లో బుమ్రా.. హారిస్ (3)ను పెవిలియన్‌కు పంపించేశాడు. హార్దిక్ బౌలింగ్‌లో అయూబ్ క్యాచ్‌ను బుమ్రా అందుకుంటే.. బుమ్రా బౌలింగ్‌లో హారిస్ క్యాచ్‌ను హార్దిక్ పట్టాడు. వెంటనే బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ జమాన్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించడంతో పాక్ 6/3తో నిలిచింది. అయితే సమీక్ష కోరిన జమాన్.. నాటౌట్‌గా తేలాడు. అతను, ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ పట్టుదలతో నిలవడంతో పాక్ 7 ఓవర్లకు 44/2తో కాస్త కోలుకుంది. కానీ ఆ తర్వాత స్పిన్నర్ల మాయాజాలానికి ఆ జట్టు కుదేలైంది. అక్షర్ వరుస ఓవర్లలో జమాన్ (17), అఘా (3)లను ఔట్ చేసి పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఆ తర్వాత కుల్‌దీప్ అందుకున్నాడు. అతను వరుస బంతుల్లో హసన్ నవాజ్ (5), మహ్మద్ నవాజ్ (0)లను ఔట్ చేశాడు. 13 ఓవర్లకు 65/6తో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టు వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ ఓ ఎండ్‌లో ఫర్హాన్ పోరాటం కొనసాగించాడు. అర్ధశతకం దిశగా సాగుతున్న అతణ్ని కూడా కుల్‌దీప్ ఔట్ చేయగా.. ఫాస్ట్‌బౌలర్ షహీన్ అఫ్రిది ఆఖర్లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
‘‘పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు బాసటగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలుపుతున్నాం. ఈ విజయాన్ని సాయుధ దళాలకు అంకితమివ్వాలనుకుంటున్నాం’’
సూర్యకుమార్
కరచాలనాల్లేవు..

దుబాయ్: ఆసియా కప్ ముంగిట విలేకరుల సమావేశంలో అంటీముట్టనట్లు వ్యవహరించిన భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు సూర్యకుమార్, సల్మాన్ అఘా.. ఆదివారం మ్యాచ్‌లో టాస్ సందర్భంగా కరచాలనం చేసుకోలేదు. కనీసం ఒకరి వైపు ఒకరు చూడకుండానే టాస్ తంతు పూర్తిచేశారు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్: అయూబ్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0; ఫర్హాన్ (సి) హార్దిక్ (బి) కుల్‌దీప్ 40; హారిస్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 3; జమాన్ (సి) తిలక్ (బి) అక్షర్ 17; అఘా (సి) అభిషేక్ (బి) అక్షర్ 3; హసన్ నవాజ్ (సి) అక్షర్ (బి) కుల్‌దీప్ 5; మహ్మద్ నవాజ్ ఎల్బీ (బి) కుల్‌దీప్ 0; ఫహీమ్ ఎల్బీ (బి) వరుణ్ 11; షహీన్ అఫ్రిది నాటౌట్ 33; ముఖీమ్ (బి) బుమ్రా 10; అబ్రార్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127 వికెట్ల పతనం: 1-1, 2-6, 3-45, 4-49, 5-64, 6-64, 7-83, 8-97, 9-111; బౌలింగ్: హార్దిక్ పాండ్య 3-0-34-1; బుమ్రా 4-0-28-2; వరుణ్ చక్రవర్తి 4-0-24-1; కుల్‌దీప్ యాదవ్ 4-0-18-3; అక్షర్ పటేల్ 4-0-18-2; అభిషేక్ శర్మ 1-0-5-0
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) ఫహీమ్ (బి) అయూబ్ 31; శుభ్‌మన్ (స్టంప్డ్) హారిస్ (బి) అయూబ్ 10; సూర్యకుమార్ నాటౌట్ 47; తిలక్ వర్మ (బి) అయూబ్ 31; దూబె నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 131 వికెట్ల పతనం: 1-22, 2-41, 3-97; బౌలింగ్: షహీన్‌షా అఫ్రిది 2-0-23-0; సైమ్ అయూబ్ 4-0-35-3; అబ్రార్ అహ్మద్ 4-0-16-0; నవాజ్ 3-0-27-0; ముఖీమ్ 2.5-0-29-0
ఆసియాకప్‌లో ఈనాడు
యూఏఈ × ఒమన్
వేదిక: అబుదాబి, సా।। 5.30
శ్రీలంక × హాంకాంగ్
వేదిక: దుబాయ్, రా।। 8.00 
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 


