Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ను అందించిన ఆ ఒక్క మీటింగ్‌..!

ప్రపంచకప్‌లో తొలుత ఎదురైన ఓటముల నుంచి ఎలా బయటపడ్డామనే రహస్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ బయటపెట్టాడు. కేవలం ఒక్క మీటింగ్‌ జట్టు ఆటతీరును మార్చేసిందన్నాడు. 

Published : 28 Nov 2023 10:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియా జట్టు ఒక దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.. కానీ, గోడకు కొట్టిన బంతిలా ఒక్కసారిగా పుంజుకొని విశ్వవిజేతగా నిలిచింది. దీని వెనుక సీక్రెట్‌ను ఆ జట్టు కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ తాజాగా వెల్లడించాడు. దక్షిణాప్రికాతో ఓటమి తర్వాత జట్టు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడం కోసం ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని నిర్ణయాలే తమ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు. ఈ సమావేశంలో జట్టులోని లోపాలపై నిజాయతీగా చర్చించుకొన్నట్లు మెక్‌డొనాల్డ్‌ చెప్పాడు. 

సిరీస్‌పై భారత్‌ కన్ను

‘‘అప్పటి వరకు జట్టు వ్యూహానికి ఫలితం లభించకపోయినా.. దానిలో ఎటువంటి మార్పు చేయకుండానే తీవ్రంగా ప్రయత్నించాలని అనుకున్నాం. తాము సరైన మార్గంలోనే ఉన్నామని.. వ్యూహానికి కట్టుబడి.. అనుకొన్న లక్ష్యాన్ని సాధిస్తామని నమ్మకం పెంచుకోవాలని నిర్ణయించాం. మొదట్లో ఫలించని వ్యూహం ఆ తర్వాత మెల్లగా ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది. గతంలో భారత్‌లో మేము టెస్ట్‌ సిరీస్‌ ఆడిన సమయంలో 0-2 తేడాతో వెనుకబడ్డాము. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని భావించాను. జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తొలుత నిర్దేశించిన వ్యూహాన్ని అనుసరించాం. ఎందుకంటే ఆ సమయంలో మీరు పూర్తిగా వ్యూహాన్ని మారిస్తే అది జట్టులో భయాన్ని, ఆందోళనను పెంచుతుంది. ఈ సమావేశం జరిగే నాటికి మేము 9 మ్యాచ్‌ల ప్రపంచకప్‌ లీగ్‌ దశలో 0-2తో మాత్రమే వెనుకబడ్డాము. ఆ సమయంలో మా అసలు వ్యూహాన్ని మొత్తం పక్కనపెట్టాల్సిన అవసరం లేదని భావించాం’’ అని మెక్‌డొనాల్డ్‌ వివరించాడు.

ఈ టోర్నీలో నాకౌట్లతో సహా 11 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓటమి అంచు వరకు వెళ్లిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్‌ ఒంటరి పోరాటంతో విజయం అందుకొంది. ప్రపంచకప్‌లో అతిపెద్ద మ్యాజిక్‌ ఇన్నింగ్స్‌ల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత వరుసగా తొమ్మది విజయాలు నమోదు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ట్రావిస్‌ హెడ్‌ వంటి బ్యాటర్‌ను సరైన సమయంలో జట్టులోకి తీసుకొని సత్ఫలితాలను సాధించింది. సాధారణంగా ప్రపంచకప్‌ వంటి మెగాటోర్నీలో రెండు ఓటములతో ప్రారంభించిన ఏ జట్టు అయినా తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకొని మార్పులు చేసుకొంటుంది. కానీ, ఆసీస్‌ మాత్రం తన వ్యూహానికే కట్టుబడి విశ్వవిజేతగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని