India vs Australia: సిరీస్‌పై భారత్‌ కన్ను

ప్రపంచకప్‌ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్‌ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం.

Updated : 28 Nov 2023 09:25 IST

ఆస్ట్రేలియాతో మూడో టీ20 నేడు
రాత్రి 7 గంటల నుంచి
గువాహటి

ప్రపంచకప్‌ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్‌ఇండియా(India vs Australia).. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో మరో పోరుకు సిద్ధమైంది. మూడో టీ20 నేడే. మరి భారత్‌ ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా? లేదా ఆస్ట్రేలియా పుంజుకుంటుందా? ఆసక్తికర సమరం ఖాయం.

సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా పొట్టి సిరీస్‌లో కీలక సమరానికి సన్నద్ధమైంది. మంగళవారం జరిగే మూడో టీ20లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్‌.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. గువాహటిలో భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

ఉత్సాహంగా భారత్‌: సిరీస్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బ్యాటర్లు మరోసారి చెలరేగిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగి ఆడిన భారత్‌.. 36 ఫోర్లు, 24 సిక్స్‌లు కొట్టింది. ఓపెనర్‌ జైస్వాల్‌ జోరు మీదుండడం ఆతిథ్య జట్టుకు కలిసొచ్చే అంశం. రెండో టీ20లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జైస్వాల్‌.. 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌, మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా అర్ధ సెంచరీలతో ఫామ్‌ను చాటుకున్నారు. ఆఖర్లో మెరుపులు మెరిపించిన రింకు సింగ్‌ ఫినిషర్‌గా మరోసారి సత్తా చాటుకోవడం టీమ్‌ఇండి యాకు సంతోషాన్నిచ్చే విషయం. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు క్రమంగా ఆరో స్థానంలో స్థిరపడుతున్నాడు. కానీ అయిదో స్థానంలో ఆడుతోన్న తిలక్‌ పరిస్థితే కాస్త క్లిష్టంగా ఉంది. తొలి రెండు టీ20ల్లో అతడు 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌ల్లో 10 బంతుల్లో 12 పరుగులు చేసిన అతడికి.. రింకు తనకన్నా ముందు రావడంతో రెండో మ్యాచ్‌లో చివరి రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. తన సత్తా నిరూపించుకోవడానికి ఈ సిరీస్‌లో బహుశా తిలక్‌కు ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఎందుకంటే చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వస్తాడు. అప్పుడు తిలక్‌ తుది జట్టులో చోటు కోల్పోయేందుకు ఆస్కారముంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా తిలక్‌కు మరిన్ని బంతులు ఆడే అవకాశమొస్తుందో లేదో చూడాలి. అందుకోసం కెప్టెన్‌ సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వస్తాడా అన్నది ఆసక్తికరం. తుది జట్టులో భారత్‌ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక బంతితో రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే బౌండరీల సంఖ్యను తగ్గించగలిగారు. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ చక్కగా బౌలింగ్‌ చేశారు. అయితే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 87 పరుగులిచ్చి ఒకే వికెట్‌ పడగొట్టిన ఎడమచేతి వాటం పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మెరుగుపడాల్సివుంది. ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్‌ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం అవసరం.

ఆస్ట్రేలియా పుంజుకునేనా..!: ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. మ్యాక్స్‌వెల్‌ కూడా తనదైన శైలిలో ఆడాలని ఆ జట్టు కోరుకుంటోంది. ఓపెనర్లు స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ షార్ట్‌ల నుంచి జట్టు శుభారంభం ఆశిస్తోంది. ఆ జట్టు బౌలర్ల  ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన పేసర్‌ అబాట్‌ స్థానంలో బెరెన్‌డార్ఫ్‌ ఆసీస్‌ తుది జట్టులోకి రావచ్చు.


తుది జట్లు (అంచనా)... భారత్‌: యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.

ఆస్ట్రేలియా: స్మిత్‌, మాథ్యూ షార్ట్‌, ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌, ఆడమ్‌ జంపా, నాథన్‌ ఎలిస్‌, బెరెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా


పిచ్‌ ఎలా..

గువాహటిలో ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అందులో ఒకటి (భారత్‌ × శ్రీలంక) వర్షం కారణంగా రద్దయింది. పూర్తయిన రెండు మ్యాచ్‌లు పూర్తి భిన్నంగా సాగాయి. బౌలింగ్‌ అనుకూల పిచ్‌పై.. బెరెన్‌డార్ఫ్‌ స్వింగ్‌ బౌలింగ్‌తో భారత టాప్‌ ఆర్డర్‌ను దెబ్బతీయడంతో 2017లో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయిదేళ్ల తర్వాత పరుగుల వరద పారిన మ్యాచ్‌లో భారత్‌ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ మ్యాచ్‌లో మొత్తం 458 పరుగులు వచ్చాయి. ప్రస్తుత మూడో టీ20కి ఎలాంటి వర్షం ముప్పు లేదు. కానీ ఉక్కపోత ఉండొచ్చు. మంచు ప్రభావం ఉండే అవకాశముంది.


60

టీ20 క్రికెట్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా నిలవడానికి సూర్యకుమార్‌ యాదవ్‌కు కావాల్సిన పరుగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని