Jasprit Bumrah: బుమ్రా ఒక్కడే నిలకడగా యార్కర్లు సంధించే బౌలర్: బ్రెట్‌ లీ

టీ20 ప్రపంచ కప్‌ సమీస్తున్న వేళ.. అన్ని జట్లూ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆసీస్ మాజీ స్టార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 May 2024 17:53 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) అందరి దృష్టి భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపైనే (Jasprit Bumrah) ఉందనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ.. బుమ్రా వద్ద ఉన్న ప్రత్యేకత వారెవరికీ లేదనేది మాజీ క్రికెటర్ల మాట. అతడు సంధించే యార్కర్లను అడ్డుకోవడం హేమాహేమీ బ్యాటర్లకే సాధ్యపడదు. ఈ పొట్టి కప్‌లో బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు. డెత్‌ ఓవర్లలో అతడి బౌలింగ్‌ పదును మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. 

‘‘ఇటీవల కాలంలో బుమ్రాలా నిలకడగా యార్కర్లు వేసిన బౌలర్లను చూపించండి. అతడిలా మరింతమంది యార్కర్లను వేయడం చూడాలని ఉంది. కొందరు వేస్తున్నారు కానీ డెత్‌ ఓవర్లలో ఎక్కువగా సంధించడం లేదనేది నా అభిప్రాయం. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చాలాసార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. పేసర్లు ఇంకాస్త వైవిధ్యంగా బంతులేయడం అలవాటు చేసుకోవాలి. స్కూప్ షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకొనే బ్యాటర్లను ఎదుర్కోవాలంటే యార్కర్లే కీలకం. వికెట్ల వెనక, థర్డ్‌మ్యాన్‌ దిశగా ఫీల్డర్లను పెట్టి అప్పుడు ఆ బంతిని వేస్తే.. షాట్ కొట్టేందుకూ బ్యాటర్లు బెంబేలెత్తిపోతారు. గతంలో 180 నుంచి 200 కొడితే చాలా మంచి స్కోరుగా భావించేవాళ్లం. ఇప్పుడు మాత్రం 260+ కొట్టినా గెలిచేవరకూ నమ్మకం ఉండటం లేదు. అందుకే, బ్యాటింగ్‌కు బౌలింగ్‌కు, బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరం లేకపోలేదు’’ అని బ్రెట్ లీ (Brett lee) వ్యాఖ్యానించాడు. 

విరాట్ నుంచి చాలా నేర్చుకున్నా: విల్ జాక్స్‌

ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లాండ్‌ బ్యాటర్ విల్ జాక్స్‌ టీమ్‌ఇండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీపై (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. అతడినుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు జాక్స్‌ తెలిపాడు. ‘‘కోహ్లీ నుంచి మొదట గెలవాలనే యాటిట్యూడ్‌ను నేర్చుకున్నా. ప్రతిరోజూ మెరుగైన ప్రదర్శన చేయడంపై దృష్టిసారించా. చాలామంది అతడితో కలిసి పనిచేయడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. కానీ అతడితో ఉంటే చాలా సులువుగా అనిపించింది. ప్రతీ బంతిని 100 శాతం అంచనా వేసి బాదేందుకు ప్రయత్నిస్తాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీతో కలిసి ఆడటం ఎప్పుడూ మజానిస్తుంది. అవసరమైన సమయంలో రిస్క్‌ తీసుకోవడానికీ వెనుకాడడు’’ అని జాక్స్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని