Rohit Sharma: హార్దిక్‌ను అనాలని కాదు.. అది రోహిత్‌పై అభిమానం: గిల్‌క్రిస్ట్‌

హార్దిక్‌ పాండ్య విషయంలో అభిమానుల తీరుపై ఆసీస్‌ మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 04 Apr 2024 12:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి (Mumbai) మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క విజయాన్ని నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలో ఖాతా తెరవని ఏకైక జట్టు కూడా ముంబయి కావడం గమనార్హం. ఆ జట్టు సారథ్య బాధ్యతలను తీసుకున్న హార్దిక్‌ పాండ్యపై (Hardik Pandya) సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ఇప్పుడు మ్యాచ్‌ల సమయంలోనూ అభిమానులు అతడిని హేళన చేసేలా నినాదాలు చేస్తూ ప్రవర్తించడం మాజీ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో రోహిత్‌ శర్మ (Rohit Sharma) అలా చేయొద్దని అభిమానులకు సూచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే, తమ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై అభిమానం వల్లే పాండ్య ట్రోలింగ్‌కు గురి కావాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. హార్దిక్‌కు కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించడం రహస్యంగా జరిగినట్లు ఫ్యాన్స్‌ భావించడమూ మరో కారణంగా పేర్కొన్నాడు. 

‘‘ఈ మ్యాచ్‌ల సందర్భంగా రోహిత్ శర్మ స్థాయి ఏంటనేది తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించి.. గుజరాత్‌ నుంచి తీసుకొచ్చి మరీ హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం మిస్టరీగా జరిగిపోయింది. అత్యంత కఠినమైన నిర్ణయం. ఐపీఎల్‌లో ఇలాంటివి సహజమే. ఫ్యాన్‌బేస్‌ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒకే స్థాయి కలిగిన దానికి కచ్చితమైన ప్రతిరూపం ఎంపిక చేయడం చాలా కష్టం. ఇప్పుడు ముంబయి జట్టులో పరిస్థితి కూడా ఇలానే ఉంది. గతంలో నాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఆసీస్‌ తరఫున వన్డే అరంగేట్రం చేసినప్పుడు క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలే స్థానంలో నేను వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టా. నా సొంత దేశంలోనూ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. నేను మైదానంలోకి దిగినప్పుడు ఎగతాళి చేస్తున్నట్లు కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హార్దిక్‌ ఎలా ఫీల్ అవుతున్నాడో.. నాకు తెలుసు. తప్పకుండా పాండ్యను కలుసుకుంటా. అభిమానుల మనసు ఎలా గెలుచుకోవాలో చెబుతా. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది’’ అని గిల్‌క్రిస్ట్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని