Arjun Tendulkar: అర్జున్‌పై విమర్శలు.. వారంతా కీబోర్డు యోధులు: బ్రెట్‌ లీ

ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) గెలిచినా.. ఓడినా సచిన్‌ కుమారుడు అర్జున్ తెందూల్కర్‌ ప్రదర్శనపైనే చర్చంతా సాగుతుండటం విశేషం. కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన అర్జున్ విమర్శలు మాత్రం భారీగానే ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసీస్‌ దిగ్గజ పేసర్ బ్రెట్‌ లీ మద్దతుగా నిలిచాడు.

Published : 26 Apr 2023 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అర్జున్‌ తెందూల్కర్‌పై (Arjun Tendulkar) దృష్టిసారించారు. ప్రతి మ్యాచ్‌లో ఎలా ఆడుతున్నాడనే దానిపై బేరీజు వేసుకుంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ముంబయి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యేక ఆకర్షణ అర్జున్‌ తెందూల్కరే. తొలి మ్యాచ్‌లో (కోల్‌కతాపై) కాస్త ఫర్వాలేదనిపించిన అర్జున్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించాడు. దీంతో అతడిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. అయితే, తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (GT vs MI) రెండు ఓవర్లలో అర్జున్ ఒక వికెట్‌ తీసి కేవలం 9 పరుగులను మాత్రమే ఇచ్చి విమర్శకులకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే అర్జున్‌పై విమర్శలు గుప్పించినవారిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి విమర్శలను తాను కూడా అనుభవించినట్లు గుర్తు చేశాడు. 

‘‘బయట నుంచి ఎవరో ఒకరు ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉంటారు. సీనియర్‌ బౌలర్‌ అయిన సందీప్ శర్మ 120 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. అర్జున్‌ అంతకంటే ఎక్కువ వేగంతో విసురుతాడు. అతడికి ఇంకా 23 ఏళ్లే. అర్జున్‌కు ఇంకా చాలా కెరీర్‌ ఉంది. అందుకే, అతడికి నేనిచ్చే సలహా ఒక్కటే.. ఇలాంటి విమర్శలను ఎప్పుడూ వినొద్దు. అర్జున్‌లో అద్భుతమై నైపుణ్యాలు ఉన్నాయి. నిలకడగా 140 కి.మీ వేగంతో వేస్తున్నాడు. తప్పకుండా ముంబయి జట్టుకు అద్భుత ప్రదర్శన ఇవ్వగలడు. భారీ సంఖ్యలో హాజరయ్యే అభిమానుల మధ్య ఆడేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అతడి పేస్‌ కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు అర్జున్ పేస్‌లో ఎలాంటి సమస్యలను చూడలేదు. ఎలా బౌలింగ్‌ వేయాలని అనుకుంటున్నాడో అలా చేయాలి. అంతేకానీ, బయట నుంచి విమర్శలు చేసేవారిని పట్టించుకోకూడదు. వీరంతా తమ జీవితంలో ఒక్కబంతినైనా వేసి ఉండరు. వాళ్లంతా కీబోర్డు వారియర్లు’’ అని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముంబయి బౌలర్లలో అర్జున్ (2-0-9-1) మినహా మిగతావారంతా భారీగానే పరుగులు సమర్పించారు. కామెరూన్ గ్రీన్‌ అయితే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 39 రన్స్ ఇచ్చాడు. అర్జున్ ఉత్తమ బౌలింగ్‌ వేసినా కెప్టెన్‌ రోహిత్ మాత్రం కేవలం రెండు ఓవర్లను మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ 207/6 భారీ స్కోరు చేసింది. అనంతరం టాప్ ఆర్డర్‌ విఫలం కావడంతో ముంబయి 152/9 స్కోరుకే పరిమితమైంది. నేహాల్ వధేరా (40) టాప్‌ స్కోరర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని