Australia Team: ఆడుతోంది ఆస్ట్రేలియానేనా!

ఐదుసార్లు ప్రపంచ వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా (Australia Team) జట్టు ఈసారి మాత్రం పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండింట్లోనూ ఓటమిపాలైంది. 

Published : 13 Oct 2023 13:44 IST

గత ఎనిమిది వన్డేల్లో ఒకే ఒక్క విజయం! అందులోనూ దక్షిణాఫ్రికా చేతిలో నాలుగు పరాభవాలు! ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి! ఇది మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా (Australia Team) ఆట. ఒకప్పుడు భీకరంగా చెలరేగి మిగిలిన జట్లను చివురుటాకులా వణించిన ఆస్ట్రేలియానేనా ఇలా ఆడేది అనే అనుమానం కలుగుతోంది. మరి ఆసీస్‌కు ఏమైంది:! ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ అయిదుసార్లు ఛాంపియన్‌.. ఆరంభంలోనే ఇలా వెనుకబడడం అభిమానులకు మింగుడుపడట్లేదు. 

ఇంత చెత్త ఫీల్డింగా!

క్యాచ్‌లు ఎలా పట్టాలో.. ఎలా ఫీల్డింగ్‌ చేయాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలి అన్నట్లు ఉండేది ఆ జట్టు ఫీల్డింగ్‌. కానీ, అలాంటిది ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఏకంగా అయిదు సులభమైన క్యాచ్‌లను ఆ జట్టు జారవిడిచిన తీరు అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్‌తో తొలి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ ఫీల్డింగ్‌ గొప్పగా ఏం లేదు. భారత్‌ ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించినట్లు కనిపించిన ఆ జట్టు.. కీలక సమయంలో కోహ్లి క్యాచ్‌ వదిలేసి మూల్యం చెల్లించుకుంది. ఏకంగా మ్యాచ్‌నే కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ ఇదే వరుస. తేలికైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. చేతిలో పడిన క్యాచ్‌లను కూడా  కంగారూ ఫీల్డర్లు విడిచిపెట్టారు. టాప్‌ ఫీల్డింగ్‌ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన అనూహ్యమే. ప్రపంచకప్‌ మాత్రమే కాదు ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, భారత్‌తో సిరీస్‌లలోనూ ఆసీస్‌ ఫీల్డర్లు ఆకట్టుకోలేకపోయారు. కంగారూలు గ్రౌండ్‌ ఫీల్డింగ్‌లో ఇంత పేలవంగా ఉండడం ఇదే తొలిసారి. ఫీల్డింగ్‌లో ఒకప్పటి సమన్వయం కూడా లేదు. భారత్‌తో పోరులో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మార్ష్, వికెట్‌కీపర్‌ కేరీ కలిసి నేలపాలు చేశారు.

ఓటమి నంబర్‌ 4

గత ప్రపంచకప్‌లో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడడం ఆసీస్‌కు ఇదే తొలిసారి. 2019 ప్రపంచకప్‌లో ఇదే దక్షిణాఫ్రికా చేతిలో లీగ్‌ దశలో ఓడిన కంగారూ జట్టు.. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్‌ చేతిలో మట్టి కరిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి ఎలాగైనా ఆరోసారి కప్‌ పట్టాలన్న ఆశయంతో ప్రపంచకప్‌ బరిలో దిగిన ఆసీస్‌.. తొలి రెండు మ్యాచ్‌ల్లో బలమైన జట్ల చేతిలో ఓడి సెమీస్‌ అవకాశాలను తనకు తానే దెబ్బ తీసుకుంది. మ్యాచ్‌లో చిన్న అవకాశం దొరికితే చాలు ఉడుంపట్టు పట్టి గెలిచేదాకా వదలకపోవడం ఆసీస్‌ స్టైల్‌. అలాంటిది 2 పరుగులకే 3 వికెట్లు తీసి కూడా భారత్‌ చేతిలో ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా దెబ్బ తీసింది. రెండో మ్యాచ్‌లో ఇంకా దారుణంగా 134 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తు కావడంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. ఈ ఏడాది మార్చి నుంచి 4 సందర్భాల్లో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు. 1992 ప్రపంచకప్‌ తర్వాత టోర్నీ తొలి మ్యాచ్‌ ఓడడం కూడా కంగారూలకు ఇదే తొలిసారి. అన్నింటికంటే దారుణం ఏమిటంటే 10 జట్లు పోటీపడుతున్న టోర్నీలో 2 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ నెదర్లాండ్స్‌ కన్నా ఆఖరిగా 9వ స్థానంలో ఉండడం!

పుంజుకోకుంటే కష్టమే

రెండు మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టు పనైపోయింది అనలేం. కానీ ఈ ఆటతీరు మార్చుకోకపోతే కష్టం. ఆసీస్‌ చేతిలో ఇంకా 7 మ్యాచ్‌లు ఉన్నాయి. మరో మ్యాచ్‌ ఓడితే ఆ జట్టుకు సెమీఫైనల్‌ మార్గం మరింత క్లిష్టమవుతుంది. చిన్న జట్లే కదా అని అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లను తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో ఆసీస్‌కు పెద్ద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లను ఓడించడం కంగారూలకు పెద్ద సవాల్‌. ఉన్నట్టుండి బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆ జట్టుకు బలహీనతగా మారింది. ముఖ్యంగా ఓపెనర్లు సరైన ఆరంభాలను ఇవ్వలేకపోతున్నారు. వార్నర్‌ స్థిరంగానే ఆడుతున్నా.. మిచెల్‌ మార్ష్‌లో స్థిరత్వం లేదు. పేసర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తుండడం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తేలిపోతుండడం ఆసీస్‌ను దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకుంటే ఆ జట్టుకు మన్ముందు మరిన్ని చేదు అనుభవాలు తప్పవు. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని