Bengaluru X Hyderabad: వరుస ఓటములు జట్టును కుంగదీశాయి: బెంగళూరు కెప్టెన్‌

Bengaluru X Hyderabad: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్‌ జట్లు సోమవారం తలపడ్డాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ రికార్డు స్కోరు నమోదు చేసింది. దీంతో  ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్‌ అనంతరం దాని కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఓటమికి గల కారణాలను వివరించాడు.

Updated : 16 Apr 2024 10:40 IST

బెంగళూరు: ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు జట్టుకు.. సోమవారం హైదరాబాద్‌ చేతిలోనూ పరాభవం తప్పలేదు. పైగా బౌలర్లను సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఓ ఆటాడేసుకున్నారు. ఫలితంగా వారి జట్టు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. వరుస వైఫల్యాలతో తమ ప్లేయర్లలో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపాడు.

‘‘ఈ రోజు పిచ్‌పై నమోదైన స్కోర్లు ఓ ప్రపంచ రికార్డు. మేం చేసిన 262 పరుగులు కూడా తక్కువేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చాలా కష్టం. మేం కొన్ని ప్రయత్నాలు చేశాం. కానీ, అవి ఫలించలేదు. వరుస విజయాలు దూకుడును పెంచినట్లే.. ఓటములు దాన్ని లాగేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం లేకుండా బరిలోకి దిగితే అది ఆటతీరులోనూ ప్రతిఫలిస్తుంది. ఫాస్ట్‌బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్‌ విషయంలోనూ మేం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. పవర్‌ప్లే తర్వాత రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకోవాలి. మా బ్యాటర్లు తమ వంతు కృషి చేశారు. ఎక్కడా చేతులెత్తేయలేదు. క్రికెట్‌లో మైండ్‌ను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. ఒక్కోసారి ఒత్తిడికి బుర్ర బద్దలౌతుందేమో అనిపిస్తుంది. అయితే, బరిలోకి దిగాక మాత్రం పూర్తి కమిట్‌మెంట్‌తో ఆడాల్సి ఉంటుంది’’ అంటూ మ్యాచ్‌ సమయంలో తమపై ఒత్తిడి పనిచేసినట్లు డుప్లెసిస్‌ అంగీకరించాడు.

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్‌ ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (102) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్‌ (67), సమద్‌ (37), అభిషేక్‌ శర్మ (34), మార్‌క్రమ్‌ (32 నాటౌట్‌) కూడా రాణించారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (62), కోహ్లి (42) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత జట్టు గాడి తప్పింది. దినేశ్‌ కార్తీక్‌ (83) సంచలన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని