WTC Final-Gill: కామెరూన్‌ గ్రీన్‌ వివాదాస్పద క్యాచ్‌.. బంతి నేలను తాకింది: రికీ పాంటింగ్

ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) క్యాచ్‌ ఔట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  దీని గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 

Published : 12 Jun 2023 19:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final 2023)లో భారత్‌ ఓటమిపాలైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్‌ సేన (Team India) 234 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) క్యాచ్‌ ఔట్‌ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతిని స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌ ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్‌ అందుకున్నట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్‌ కెటిల్‌బోరో ఔట్‌గా ప్రకటించడంతో గిల్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. అప్పటి నుంచి ఈ క్యాచ్‌ గురించి పెద్ద చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలో ఈ క్యాచ్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కామెరూన్ గ్రీన్‌ క్యాచ్‌ అందుకున్నప్పుడు బంతి నేలను తాకిందని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో థర్డ్ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు.

‘‘ప్రత్యక్షప్రసారంలో చూసినప్పుడు గ్రీన్‌ క్యాచ్‌ సరిగ్గానే అందుకున్నట్లు అనిపించింది. కానీ, మేం అన్ని రీప్లేలు చూసిన తర్వాత బంతి పూర్తిగా చేతిలోకి వచ్చిందా? లేదా అనే దానిపై నాకు స్పష్టత రాలేదు. వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్‌కు బాల్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నంత వరకు అది ఔట్ అని అంపైర్‌ భావిస్తాడు. ఇక్కడ  సరిగ్గా అదే జరిగి ఉండొచ్చు. ఈ క్యాచ్‌ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. భారత్‌లోని ప్రతీ ఒక్కరూ ఇది నాటౌట్ అని అనుకుంటారు. ఆస్ట్రేలియా వారు ఇది ఔట్ అని భావిస్తారు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇచ్చి ఉంటే.. ఆ నిర్ణయాన్ని మార్చేందుకు ఆధారాన్ని థర్డ్ అంపైర్ కనుగొని ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే, బంతి నేలకు తాకిందనేలా తుది ఆధారం ఏదీ లేదని నేను అనుకుంటున్నా. సాఫ్ట్ సిగ్నల్ లేకున్నా.. థర్డ్ అంపైర్ అందుకే దీన్ని ఔట్‍గా ఇచ్చారని, అతను తీసుకున్న నిర్ణయం సరైనదని భావిస్తున్నా” అని పాంటింగ్ వివరించాడు. 

థర్డ్ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా అసమ్మతి వ్యక్తం చేశాడు. ఇది ఐసీసీ (ICC) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కిందకు వస్తుందని గిల్‌కు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో 100  శాతం కోత విధించింది. ఈ లెక్కన చూసుకుంటే గిల్‌కు 115 శాతం జరిమానా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని