RCB: ఫామ్‌తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!

ఈ ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరుపై ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్‌ విన్నర్లుగా అవతరిస్తున్నారు.

Updated : 09 Apr 2024 11:54 IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి. ఎప్పుడూ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుంటుంది. కానీ ప్రదర్శన చూస్తే అంతంతమాత్రం. ప్రతిసారీ కప్పు మీద బెంగళూరు అభిమానులు భారీ ఆశలు పెట్టుకోవడం.. ఆ జట్టు అందుకు తగ్గట్లు సాగక మధ్యలోనే నిష్క్రమించడం మామూలే. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అసలు ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా ఆర్సీబీ అనగానే చెలరేగిపోయి ఆడేస్తుండడం.. ఆ జట్టు పాలిట విలన్లుగా మారుతుండడం గమనార్హం. దీంతో ఎవరైనా ఫామ్‌లో లేకుంటే ఆర్సీబీ వారిని గాడిన పడేలా చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై జోకులు పేలుతున్నాయి.

తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది బెంగళూరు. ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత శతకంతో జట్టుకు 183 పరుగుల స్కోరు అందించినా ఫలితం లేకపోయింది. అంత పెద్ద లక్ష్యాన్ని రాయల్స్ అలవోకగా, ఆడుతూ పాడుతూ ఛేదించింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌటవ్వగానే రాజస్థాన్‌కు కష్టమే అనుకున్నారు. ఎందుకంటే మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్‌లో లేడు. పేలవ ఆరంభం తర్వాత ఆ జట్టు ఏం పుంజుకుంటుందిలే అన్న కామెంట్లు వినిపించాయి. కానీ తన తొలి మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా తడబడుతూ.. వరుసగా 11, 11, 13 పరుగులే చేసిన బట్లర్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. పేలవ ఫామ్‌ నుంచి బయటపడి ఆర్సీబీ మీద చెలరేగిపోయిన ఆటగాడు బట్లర్ ఒక్కడే కాదు. గత మ్యాచ్‌ల్లో కూడా కొందరు ఆటగాళ్లు ఇలాగే బెంగళూరుతో మ్యాచ్ అనగానే లయ అందుకున్నారు.

రెచ్చిపోయిన క్వింటన్‌ డికాక్‌..

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్‌ డికాక్‌ కూడా ఈ ఐపీఎల్ ముంగిట అంత మంచి ఫామ్‌లో లేడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. సీజన్ మొత్తంలో ఒక్క అర్ధసెంచరీనే సాధించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనూ 4 పరుగులే చేశాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై అర్ధశతకం సాధించినా.. సాధికారికంగా ఆడలేకపోయాడు. కానీ బెంగళూరు మీద మాత్రం రెచ్చిపోయాడు 56 బంతుల్లోనే 81 పరుగులు చేసి మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో లఖ్‌నవూ ఆర్సీబీని సులువుగా ఓడించింది.

సునీల్ నరైన్ విధ్వంసం..

సునీల్ నరైన్ అంటే కేవలం స్పిన్నర్ మాత్రమే. గతంలో ఒక సీజన్లో ఓపెనింగ్‌లో వచ్చిన కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. తర్వాత బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపింది లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం తిరిగి ఓపెనర్‌గా వచ్చి బ్యాటుతో రెచ్చిపోతున్నాడు. అతను ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో 2 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ ఆర్సీబీ మీద మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి బెంగళూరును పోటీలో లేకుండా చేశాడు. కోహ్లి (83 నాటౌట్) అర్ధశతకం సాయంతో 182 పరుగులు చేసిన బెంగళూరు.. నరైన్‌ను కట్టడి చేయలేకపోవడంతో ఛేదనలో కోల్‌కతా దూసుకెళ్లింది. అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనీ సీజన్లో మరే మ్యాచ్‌లోనూ రాణించలేదు.

బ్రార్‌ అద్భుత బౌలింగ్‌..

బెంగళూరు ఈ సీజన్లో సాధించిన ఏకైక విజయం పంజాబ్ మీదే. ఐతే ఆ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కష్టం మీద ఛేదించింది. ఐతే మామూలుగా చాలా సాధారణ స్పిన్నర్‌లా కనిపించే హర్‌ప్రీత్ బ్రార్ ఈ మ్యాచ్‌లో చాలా ప్రమాదకరంగా కనిపించాడు. అసలు ఫామ్‌లో లేని అతను.. ఆర్సీబీ మీద 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు ఓటమి భయం కలిగించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడబట్టి ఆర్సీబీ నెగ్గింది కానీ.. లేదంటే ఇది కూడా ఓడిపోయేదే. కాగిసో రబాడ సైతం ఈ మ్యాచ్‌తోనే ఫామ్‌ అందుకుని రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం.

లయ అందుకొన్న ముస్తాఫిజుర్‌..

ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది ఆర్సీబీ. ఆ మ్యాచ్‌తో ఫాం అందుకున్న ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్. అంతకుముందు అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన సాధారణం. చివరి 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లే తీశాడు. కానీ ఆర్సీబీతో మ్యాచ్‌లో మాత్రం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం 3 వికెట్లే తీశాడు. ఇలా ఫామ్‌లో లేని ఆటగాళ్లు, వేరే జట్లపై రాణించలేని క్రికెటర్లు ఆర్సీబీపై మాత్రం రెచ్చిపోయి ఆ జట్టుకు ఓటమి మిగులుస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. మామూలుగానే బాగా ట్రోలిం‌గ్‌కు గురయ్యే ఆర్సీబీ ఈ ఒరవడితో మరింతగా విమర్శలు ఎదుర్కొంటోంది.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని