BAN vs SL: టెన్షన్‌ పడినా.. 2 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లా

పొట్టి కప్‌లో ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. తాజాగా బంగ్లా - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ కూడా అభిమానులకు క్రికెట్ మజాను అందించింది.

Published : 08 Jun 2024 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) బంగ్లాదేశ్‌ బోణీ కొట్టింది. వరుసగా శ్రీలంకకు రెండో ఓటమి ఎదురైంది. డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 124/9 స్కోరుకే పరిమితం కాగా.. బంగ్లా 19 ఓవర్లలో 125 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లా 8 వికెట్లను కోల్పోవడం గమనార్హం. శ్రీలంక ఓపెనర్ పాతున్ నిస్సాంక (47), ధనంజయ డిసిల్వా (21) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజర్ 3, రషద్ హుస్సేన్ 3, తస్కిన్ అహ్మద్ 2, తన్జిమ్ ఒక వికెట్‌ తీశారు.

తుషారా బెంబేలెత్తించినా.. 

లంక నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ సౌమ్యా సర్కార్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ తన్జిద్ హసన్ (3) కూడా త్వరగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ నజ్ముల్ (7) కాసేపు క్రీజ్‌లో ఉన్నప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. లిటన్ దాస్ (36), తౌహిద్ హృదోయ్ (40) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మరోసారి తుషారా (4/18)తోపాటు హసరంగ (2/32) విజృంభణతో బంగ్లా కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే, మహమ్మదుల్లా (16*) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక ఇప్పుడు మరో పరాజయం నమోదు చేయడంతో సూపర్ - 8 అవకాశాలు సన్నగిల్లినట్లే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని