ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దానిగురించి ధోనీ మాత్రం స్పందించలేదు.

Published : 21 May 2024 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో చాలామంది అభిమానులు తీవ్ర వేదనకు గురయ్యారు. అందులో ఒకప్పటి సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా రాయుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటను మళ్లీ చూస్తామా? లేదా? అనే అనుమానాలను మాత్రం రాయుడు కొట్టిపడేశాడు. తప్పకుండా మరికొన్నేళ్లు ఆడతాడని.. అయితే, బీసీసీఐ ఇప్పుడు అమలుచేస్తున్న ‘ఇంపాక్ట్‌’ రూల్‌ను కొనసాగించాలని కోరాడు.  ఈ నిబంధనపై చాలామంది నుంచి వ్యాఖ్యలు వస్తున్న క్రమంలో రాయుడు ఇలా స్పందించడం విశేషం. 

‘‘ధోనీకిదే చివరి మ్యాచ్‌ అని నేను అనుకోవడం లేదు. క్రికెట్‌కు ముగింపు పలకకూడదని గట్టిగా కోరుకుంటున్నా. ఆర్సీబీతో మ్యాచ్‌ చివర్లో ఔట్‌ కావడంపై ధోనీ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. గతంలో ఎప్పుడూ అతడిని ఇలా చూడలేదు. సీఎస్కేను క్వాలిఫై చేసి.. ముగింపు ఉన్నతంగా ఉండాలని కోరుకొని ఉంటాడు. అయితే, ధోనీ గురించి మీకెవరికీ తెలియదు. తప్పకుండా అతడు వచ్చే సీజన్‌లోనూ మైదానంలోకి దిగుతాడు. ఇంపాక్ట్‌ రూల్‌తో అతడి ఆటను మళ్లీ చూసే అవకాశం ఉంది. అయితే, ఈ రూల్‌ను బీసీసీఐ కొనసాగించాలి. మేం ఎంఎస్ ధోనీ ఆడాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అది బీసీసీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాయుడు తెలిపాడు. మరోవైపు ధోనీ తన మోకాలి శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత తన భవితవ్యంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ధోనీ నుంచి నేర్చుకుంటూనే ఉన్నా: రచిన్‌

ఐపీఎల్‌లో తొలిసారి సీఎస్కే జట్టుకు రచిన్ రవీంద్ర ప్రాతినిధ్యం వహించాడు. ధోనీతో మైదానం పంచుకోవడం ఎప్పటికీ స్పెషల్‌గా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. ‘‘ప్రపంచ క్రికెట్‌లో అద్భుత ఘనత సాధించిన ఎంఎస్ ధోనీతో కలిసి ఆడా. కేవలం మైదానంలోనే కాకుండా.. వెలుపలా అతడినుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తన జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. నా పేరు గురించి గూగుల్‌లో చాలామంది శోధించినట్లు ఇటీవలే తెలిసింది. అంతకుముందు నేనెప్పుడూ దానిని పట్టించుకోలేదు. నేను భారత వారసత్వం కలిగిన వ్యక్తినే. అలాగే కివీస్‌ పౌరుడిగా చెప్పుకొనేందుకు గర్వపడతా. భారత్‌కు రావడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా’’ అని రచిన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని