Shreyas Iyer: అందుకే అయ్యర్‌పై వేటు పడింది..!

 గాయాన్ని కారణంగా చూపి రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్‌ ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేయడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.

Updated : 02 Mar 2024 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవాళీ టోర్నీల్లో ఆడనందుకు సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)కు బీసీసీఐ చోటు కల్పించలేదన్న విషయం తెలిసిందే. కిషన్‌పై వేటు ఊహించిందే అయినా అయ్యర్‌ను తొలగించడానికి గల కారణాలు మాత్రం మొదట్లో తెలియలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ పాల్గొన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడికి వార్షిక కాంట్రాక్టులో చోటివ్వకుండా బీసీసీఐ పక్కన పెట్టేసింది. దీనికి పలు కారణాలున్నాయి. రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబయి తరఫున ఆడాలని బీసీసీఐ కోరగా ఫిట్‌నెస్‌తో లేనని తెలిపి ఐపీఎల్‌ల్లో తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్‌ ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేయడంతో అతడిపై వేటు పడింది. 
‘‘ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను వార్షిక కాంట్రాక్టు ఒప్పందానికి ఈసారి పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా ఆడాలి’’ అని బీసీసీఐ పేర్కొంది. 
ముంబయి జట్టు తరఫున రంజీ క్వార్టర్‌ ఫైనల్లో ఆడకపోవడంతో వార్షిక కాంట్రాక్టు పోగొట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ తమిళనాడుతో జరగబోయే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇషాన్‌ కిషన్‌ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన తర్వాత ఏ ఒక్క సిరీస్‌లోనూ జాతీయ జట్టుకు ఆడలేదు. జార్ఖండ్‌ తరఫున రంజీల్లో పాల్గొనాలని బీసీసీఐ కోరినా పట్టించుకోకుండా ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో బీసీసీఐ అతడిని వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని