BCCI: ఏప్రిల్ 16న ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ కీలక భేటీ.. మెగా వేలంపై చర్చ!

ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో భేటీ కానుంది.

Updated : 01 Apr 2024 19:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ భేటీ కానుంది. ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీల ఓనర్లకు బీసీసీఐ సమాచారం అందించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్‌ అరుణ్ సింగ్ ధుమాల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 

ఇందులో ప్రధానంగా 2025 ఎడిషన్‌కు ముందు నిర్వహించే మెగా వేలం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్‌పై ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జట్లు రిటైన్ ఆటగాళ్ల  సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతుండగా.. మరికొన్ని జట్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు నిర్వహించిన చివరి మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఐపీఎల్ 2024 వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి జట్లకు రూ.100 కోట్ల పరిమితిని విధించారు. వచ్చే సీజన్‌ నుంచి దీనిని పెంచే అవకాశముంది.


కోల్‌కతా, రాజస్థాన్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్?

ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 17న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ రీ షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాచ్‌ జరిగే రోజే శ్రీరామనవమి కావడమే ఇందుకు కారణం. కోల్‌కతాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ రోజు మ్యాచ్‌కు తగినంత భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చు. మరికొన్ని రోజుల్లో ఈ మ్యాచ్‌ నిర్వహణ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు