IPL 2024: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై రోహిత్ కామెంట్లు.. దృష్టిసారించిన బీసీసీఐ

అదనంగా బ్యాటర్‌ లేదా బౌలర్‌ను తీసుకొనే వెసులుబాటు కల్పించిన ఇంపాక్ట్‌ రూల్‌పై కొత్త చర్చకు తెరలేసింది. దీంతో బీసీసీఐ దానిపై దృష్టిపెట్టింది.

Updated : 21 Apr 2024 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ (Impact Player) రూల్‌ సంచలనంగా మారింది. అదనంగా బౌలర్‌ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు ఆయా జట్లకు కలిగింది. కానీ, దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన తనను ఆకట్టుకోలేదని.. ఇలా చేయడం వల్ల ఆల్‌రౌండర్ల వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్ దీనిపై దృష్టి సారించింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ స్పందించారు.

‘‘భారత సారథి చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా వాటిపై దృష్టిసారిస్తాం. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం. ఇంపాక్ట్‌ రూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమే. కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలు, నష్టాలు ఉంటాయి’’ అని ధుమాల్ వెల్లడించారు. 2022-23 సీజన్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్‌ రూల్‌ను అమలు చేశారు. ఆ తర్వాత ఐపీఎల్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. 

రోహిత్ ఏమన్నాడంటే? 

‘ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఈ రూల్ అడ్డంకిగా మారుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే  క్రికెట్‌ను ఆడించాల్సింది 11 మంది ఆటగాళ్లతో. 12 మందితో కాదు. నాకు ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం ఇలా చేస్తున్నారు. కానీ, క్రికెట్ కోణంలో పరిశీలిస్తే.. నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె వంటి వారు బౌలింగ్ చేయడం లేదు. ఇది మాకు (భారత జట్టు) మంచిది కాదు’ అని రోహిత్ శర్మ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని