Rohit Sharma: రోహిత్‌ అడుగులు ఎటు.. భవితవ్యంపై చర్చించనున్న బీసీసీఐ..!

రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ భవితపై బీసీసీఐ చర్చించనుంది. ఇక పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ మెరుపులను మళ్లీ చూసేందుకు బలమైన అవకాశాలున్నాయి. కాకపోతే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌, కొత్త నాయకుడి తయారీ హిట్‌మ్యాన్‌ ప్రధాన అజెండాలో చేరే అవకాశం ఉంది.

Updated : 22 Nov 2023 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ ఓటమి హడావుడి కొంచెం తగ్గాక జట్టులో కీలక మార్పులపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రానున్న నాలుగేళ్లలో వైట్‌బాల్‌ క్రికెట్‌లో బోర్డు అనుసరించాల్సిన వ్యూహంపై రోహిత్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌తో బోర్డు చర్చించనుంది. వీటిల్లో రోహిత్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌ భవితపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టును నడిపేందుకు అవసరమైన నాయకుడిని తీర్చిదిద్దే అంశంపై కూడా వ్యూహం సిద్ధం చేయవచ్చు.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రోహిత్‌ ఈ విషయంలో స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరును టీ20 ఫార్మాట్‌కు పరిశీలించకపోయినా ఇబ్బంది లేదని బోర్డుకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సెలక్టర్లు కూడా దాదాపు ఏడాది నుంచి యువతకు టీ20 జాతీయ జట్టులో భారీగా అవకాశాలు కల్పిస్తున్నారు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో ఈ వ్యూహం నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదు. 

ఇక శ్రేయస్‌ పునరాగమనం, మూడో స్థానంలో గిల్‌ స్థిరపడటంతో రహానేకు అవకాశాలు కష్టం కావచ్చు. మరోవైపు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌ రూపంలో కేఎల్‌ సిద్ధంగా ఉన్నాడు. రోహిత్‌ కూడా తన కెరీర్‌లో ఇక టెస్ట్‌ మ్యాచ్‌లపైనే దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ సైకిల్‌ 2025 వరకు కొనసాగనుంది. అదే సమయంలో ఈ ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను సిద్ధం చేసే బాధ్యతలను కూడా రోహిత్‌పైనే పెట్టే అవకాశం ఉంది.

2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడడా..?

రోహిత్‌ వన్డే ప్రపంచకప్‌లో 406 బంతుల్లో 500 పరుగులు చేశాడు. 54 సగటు.. 125స్ట్రైక్‌ రేట్‌తో ఆడాడు. టోర్నీ మొత్తంలో అత్యధికంగా 31 సిక్సులు బాదాడు. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా హిట్‌మ్యాన్‌ను టీ20 ఫార్మాట్‌లో ఆడొద్దు అనే సాహసం చేయరు. మరోవైపు కోహ్లీ 700కుపైగా పరుగులు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు కేవలం ఏడు నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి రోహిత్‌, కోహ్లీని పక్కనపెట్టి ఆ స్థానాల్లో కొత్తవారిని తెచ్చేందుకు సెలక్టర్లు పెద్దగా మొగ్గుచూపకపోవచ్చు. అంతేకాదు.. కోహ్లీ, రోహిత్‌ ప్రపంచకప్‌ కలను తీర్చుకొనేందుకు ఈ రూపంలో మరో అవకాశం ఇచ్చినట్లవుతుంది. సెలక్టర్ల ప్రయోగాలు కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లకే పరిమితం చేసే అవకాశాలున్నాయి.

మరోవైపు కాలి మడమ గాయంతో బాధపడుతున్న హార్దిక్‌ పాండ్య జనవరి నాటికి కోలుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ అతడు కోలుకోకపోతే టీ20 ప్రపంచకప్‌ జట్టు మరో ఆల్‌రౌండర్‌ను బ్యాకప్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కష్టమే..

21వ శతాబ్దంలో భారత్‌ తరపున క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లలో కేవలం ఐదుగురే 38 ఏళ్ల తర్వాత కూడా మైదానంలో కొనసాగారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ అత్యధికంగా 40 ఏళ్ల 204 రోజుల వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇక రాహుల్‌ ద్రవిడ్‌, ధోనీ 38 ఏళ్లు దాటినా ఆటలో కొనసాగారు. ఇక ఆశిష్‌ నెహ్రా, కుంబ్లే 38వ ఏట వరకు ఆడారు. వీరిలో నెహ్రా మినహా మిగిలిన నలుగురు 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. బ్యాటర్లు అయితే 500కు పైగా మ్యాచ్‌లు పూర్తిచేశారు. ఈ లెక్కన చూసినా.. రోహిత్‌ 2027 వరకు కొనసాగడం చాలా కష్టం. ఛాంపియన్స్‌ ట్రోఫీ వరకు అతడి కెరీర్‌కు ఇబ్బంది లేకపోవచ్చు. అప్పటికి రోహిత్‌ వయస్సు 38కి చేరుతుంది. ఇక సుదీర్ఘకాలం ఆటలో కొనసాగే విషయంలో మాత్రం కోహ్లీకి ఫిట్‌నెస్‌ కలిసి రావచ్చు. రోహిత్‌తో పోలిస్తే అతడు మరికొంత కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని