IND vs ENG: రాంచీ టెస్టు.. పిచ్‌ పరిస్థితేంటో అర్థం కాలేదు: బెన్‌ స్టోక్స్‌

భారత్‌తో నాలుగో టెస్టు (IND vs ENG) జరగనున్న రాంచీ మైదానం పిచ్‌ను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పరిశీలించాడు. దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Updated : 22 Feb 2024 11:25 IST

ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ (IND vs ENG) మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పర్యటక జట్టు కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ పిచ్‌ను పరిశీలించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వికెట్‌ను ఎన్నడూ చూడలేదని.. మ్యాచ్‌ జరిగే కొద్దీ ఎలా మారుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని వ్యాఖ్యానించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తే సిరీస్‌ రేసులో నిలుస్తుంది. లేకపోతే సిరీస్‌ను కోల్పోవడమే తరువాయి. దీంతో పిచ్‌ ఎలా ఉన్నా తమ ఆటతీరులో మార్పు ఉండబోదని ఇంగ్లిష్‌ జట్టు కెప్టెన్ స్పష్టం చేశాడు.

‘‘ఇలాంటి పిచ్‌ను గతంలో ఎన్నడూ చూడలేదు. మున్ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. భారత్‌ వెలుపల మైదానాల్లో ఒక అంచనాకు రావచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ప్రతి రోజూ ఓ సవాలే. ఇప్పటికైతే పిచ్‌పై పచ్చిక ఉంది. అదే సమయంలో కొన్నిచోట్ల పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జట్లకు ఇబ్బందులు తప్పవు’’ అని బెన్‌ స్టోక్స్‌ తెలిపాడు. 

బుమ్రా గురించి ఆందోళన లేదు: డేల్‌ స్టెయిన్‌

పనిభారం నుంచి బయటపడేందుకు నాలుగో టెస్టు నుంచి బుమ్రాను జట్టు యాజమాన్యం తప్పించింది. అతడి స్థానంలో మరో యువ బౌలర్‌ను అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. అయితే, గత మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను తిప్పలు పెట్టిన బుమ్రా లేకపోవడం భారత్‌కు నష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాటిని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్‌ కొట్టిపడేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోయినా ఇబ్బందేమీ లేదని.. అదేవిధంగా వర్క్‌లోడ్‌ను అతడు చక్కగా మేనేజ్‌ చేసుకోగలడని తెలిపాడు. ‘‘ఇప్పుడు బుమ్రా ఎంత పని భారం మోస్తున్నాడో తెలియదు. అయితే, భారత ఆటగాళ్లు ఇటీవల ఎక్కువగా క్రికెట్‌ ఆడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. వారితో ఆడేందుకు ప్రత్యర్థులూ ఆసక్తిగా ఉన్నారు. ప్రయాణంలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. చాలా మంది బౌలర్లు అధికంగా ఓవర్లు వేస్తున్నారు. అందులో బుమ్రా కూడా ఉన్నాడు. కానీ, తన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. గత కొన్నేళ్లుగా టీమ్‌ఇండియా పేస్‌ దళం బలంగా ఉంది. కాబట్టి, బుమ్రా గురించి ఆందోళన అవసరం లేదు’’ అని స్టెయిన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని