Ben Stokes: వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్‌స్టోక్స్‌.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?

కేవలం ఒకే ఒక్క ఆటగాడి కోసం ఆ జట్టు కోచ్‌ సహా ప్రతి ఒక్కరూ విజ్ఞప్తులు చేశారు. మరోసారి ప్రపంచకప్‌లో తమ జట్టు విజయం సాధించాలంటే అతడు తప్పక ఉండాలని మరికొందరు పట్టుపట్టారు. ఇంతకీ ఆ క్రికెటర్ బెన్‌ స్టోక్స్‌. వన్డే క్రికెట్‌ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని తిరిగొచ్చాడు. 

Updated : 19 Aug 2023 07:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ టాప్‌ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ (Ben Stokes) తన వన్డే రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ (ODI World Cup 2023) బరిలోకి దిగేందుకు సిద్ధమేనని వెల్లడించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతడిని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు ఈసీబీ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్‌) ‘బిగ్‌ మ్యాన్‌ ఈజ్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేసింది. ఆగస్ట్ 30 నుంచి కివీస్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం బెన్‌ స్టోక్స్‌కు అవకాశం ఇవ్వగా.. సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. స్టోక్స్ చివరి వన్డే మ్యాచ్‌ 2022 జులై 19న దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఇప్పటి వరకు 105 వన్డేల్లో 2,924 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

హబీబ్‌ అంటే ఒక బ్రాండ్... కోల్‌కతాను ఊపేసిన హైదరాబాద్ ఫుట్‌బాల్‌ దిగ్గజం

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆశ ఇదే..

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ను ఊరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్‌ కల 2019లో నెరవేరింది. సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన ఆ మ్యాచ్‌లో  బౌండరీల ప్రకారం ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా ఇయాన్‌ మోర్గాన్‌ ఉన్నప్పటికీ.. ఫైనల్‌ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లాండ్‌కు కప్‌ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండోసారి కప్‌ను గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఇంగ్లాండ్‌ జట్టుకు పేస్‌ ఆల్‌రౌండర్‌గా బెన్‌స్టోక్స్‌ సేవలు అత్యవసరం. మిడిలార్డర్‌లో బెన్‌కు కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉంది. తాజాగా ఆసీస్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోనూ దూకుడైన (బజ్‌బాల్) క్రికెట్‌తో సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో ఎక్కువగా ఓవర్లు వేయనప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఇంగ్లాండ్‌కు వెన్నెముకగా నిలిచాడు. జట్టులో ఇప్పటికే బెయిర్‌ స్టో, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, సామ్‌ కరన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఉన్నప్పటికీ.. నిలకడైన ఆటతీరుతోపాటు అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడే బెన్‌స్టోక్స్‌ ఉండటం మరింత కలిసొస్తుందని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వన్డే ప్రపంచకప్‌ ప్రాథమిక జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ 

మరోవైపు, వన్డే ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. జోస్‌ బట్లర్ కెప్టెన్‌గా 15 మందిని ఎంపిక చేసింది. వన్డేల నుంచి రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని తీసుకున్న ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌కు ఈ జాబితాలో చోటుదక్కింది. అయితే, టెస్టు క్రికెట్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు ఇంగ్లాండ్‌ సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. ఫాస్ట్ బౌలర్‌ జోఫ్రా అర్చర్‌ను కూడా ఎంపిక చేయలేదు. అర్చర్‌ని ప్రపంచ కప్ ప్రణాళికలలో ట్రావెలింగ్ రిజర్వ్‌గా మాత్రమే చేర్చుతామని ఇంగ్లాండ్ సెలక్టర్ ల్యూక్‌ రైట్ స్పష్టం చేశాడు.వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన ప్రాథమిక జట్టునే ఆగస్టు 30 నుంచి కివీస్‌తో ప్రారంభంకానున్న నాలుగు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసినట్లు తెలిపాడు.

వన్డే ప్రపంచ కప్.. ఇంగ్లాండ్‌ ప్రాథమిక జట్టు ఇదే

జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని